
అన్ని జంతువులు మనిషిలోనే!
ప్రవర్తన ఆధారంగా పోలికలు
జ్యోతిష్యంలోనూ జంతు గణాలే!
అయినా మానవులు జంతువుల కంటే ఉన్నతులే!
మనుషులు.. జంతుజాతికి చెందిన వారే అని జీవశాస్త్రం చెబుతుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులకు ఆలోచించే శక్తి లేకపోవడం, మాటల రాకపోవడం వల్ల వాటికంటే మానవులే ఉచ్ఛస్థితిలో ఉన్నారనేది విదితమే. ఎంత ఉచ్ఛస్థితిలో ఉన్నా.. జంతు లక్షణాలు మాత్రం మానవుల్లో అంతర్లీనమయ్యే ఉంటాయి.. ఉన్నాయి కూడా. అందుకు పెద్దవాళ్ల తిట్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. దున్నపోతులా పెరిగావ్.. బర్రెలా అయ్యావ్.. అడ్డగాడిదలా ఎదిగావ్.. అనే తిట్ల దండకం వింటూనే ఉంటాం. నిద్రలో అదేపనిగా కదిలేవాళ్లను పందిలా దొర్లుతున్నావని, అతి తెలివి ప్రదర్శించే వారిని, ఇతరులను మోసం చేసేవారిని నక్కజిత్తులోడు అని, అతిగా కష్టం చేసేవారిని ఎద్దు, గాడిద, గొడ్డులా చాకిరి చేస్తారని పోల్చుతూ ఉంటారు. పార్టీలు మారే రాజకీయ నాయకులను గోడ మీద పిల్లులు అని అంటుంటారు. కక్షపూరితంగా వ్యవహరించే వారిని.. ‘పాముకు తలలోనే విషం ఉంటుందని, ఇలాంటి వారికి ఒళ్లంతా విషం..’ ఉంటుందని చెబుతుంటారు. సైలెంట్‌గా ఉంటూ గొడవలు సృష్టించే వారిని ‘నల్లి’కుట్లోడు అని, ‘తేలు’కొండి అని, బాగా అల్లరి చేస్తుంటే ‘కాకి’ గోల అని, ఎంత తిట్టినా ఉలుకుపలుకు లేకుండా ఉండేవారిని ‘దున్నపోతు’ మీద వానపడినట్లుగా ఉంటారని, ఇంకా కుక్కలా అరుస్తున్నావని, అవకాశ వాదులను ‘ఊసరవెల్లి’లా రంగులు మార్చేవారని, అప్పుకోసం తిరిగే వారిని ‘గోమారి’లా పట్టి పీడిస్తున్నావని, అనుకున్నది సాధించేందుకు చేసే ప్రయత్నాన్ని ‘ఉడుము’ పట్టు అని, బాగా నీరసంతో ఉన్న వాళ్లను ‘కోడి’మెడలు వేశాడని, నోట్లో పదార్థం మింగకుండానే గాబరా పడుతూ తినేవారిని ‘కుక్క’లా తినడం ఎందుకురా? అని.. చిన్నపిల్లలు అల్లరి చేస్తే ‘కోతి’ చేష్టలు అని.. ఇలా సందర్భానుసారంగా మనుషుల ప్రవర్తనను బట్టి జంతువులతో పోల్చడం అలవాటుగా మారిపోయింది. జ్యోతిశ్య శాస్త్రంలోనూ రాశుల పేర్లలో కొన్ని జీవరాశులే ఉండడం తెలిసిందే. రాశుల పేర్లతోపాటు అంశగా మేక, లేడి, పిల్లి, ఎలుక, గుర్రం, పాము, ఏనుగు, కోతి, గోవు, ముంగిస, దున్న, పులి, సింహం, కుక్క, గోవు.. అనేవి కూడా జ్యోతిశ్య శాస్త్రంలో పేర్కొనబడి ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే.. మానవులు ప్రస్తుతం జంతువుల్లానే ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుని వావి వరసలు లేకుండా.. లైంగికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు జంతువులనే తలపిస్తున్నాయి. చివరకు జంతువుల ఆవాసాలను కూడా ఆక్రమించుకుని జంతువులనే మించిపోయేలా ప్రవర్తిస్తున్నారు.
– నమస్తే.
