
అహ.. నా పండగంట!
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ‘అహ.. నా పెళ్లంట!’. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పిసినారి పాత్రలో అద్భుతంగా నటించారు. చికెన్ తినడానికి డబ్బులు దండగ అని.. కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ అన్నం తినడం ప్రేక్షకుల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే సన్నివేశం. సరిగ్గా.. అదే సీన్.. ఇప్పుడు నిజజీవితంలో ఆచరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయనిపిస్తోంది. అక్టోబర్ 2వ తేదీ అందుకు వేదిక కానుంది! సరిగ్గా అదే రోజు దసరా పండుగ. అదే రోజు గాంధీజయంతి. జీవ హింస చేయరాదన్న బాపూజీ సూక్తిని అనుసరించి.. అక్టోబర్ 2న మాంసాహారంపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నది. అయితే, అదే రోజున దసరా కావడం.. దసరాకు కీంచ్‌కట్ లేనిదే పండగ లేదనే భావన ప్రజల్లో నాటుకోవడం.. గందరగోళానికి దారి తీస్తోంది. కోట శ్రీనివాసరావు నటనలా.. అందరూ ఆ రోజున మేకలను, కోళ్లను ఇంటి గుమ్మంలో కట్టేసి.. అలాగే మద్యం సీసాల్లో థమ్సప్ పోసుకుని హాయిగా విందు కానిచ్చేస్తే.. డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.. అహ.. నా పండగంట.. అంటూ సరదాగా గడిపినట్టు ఉంటుందేమో? సినిమాÑ పండగ ఎలా ఉన్నా.. జాతిపితకు గౌరవం ఇవ్వడం భారతీయులుగా మనందరి బాధ్యత. ఒక్కరోజు మాంసాహారం తినకపోతే.. పెద్దగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదేమీ లేదు. దసరా రోజు మిగిలింది ఎలాగూ మరుసటి రోజు కానిచ్చేస్తుంటారు. అదే మొత్తం మరుసటి రోజు తినడం వల్ల చట్టం అంగీకరించకపోదూ! తిథులు, వారాలు కలిసి రావడం లేదని, ఎన్నో పండుగలు వాయిదా వేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజు వాయిదా పడిరదనుకుని.. బాపూజీ కోరినట్లు.. ఆయన పుట్టిన రోజునైనా మాంసాహారానికి దూరంగా ఉండేందుకు అందరూ సహకరిద్దాం.. అదే జాతిపితకు మనం అర్పించే నివాళి.
– నమస్తే.
