అప్పుడు ఉరిసే..! ఇప్పుడు మునిగే!!
20 ఏళ్ల క్రితం పెంకుటిళ్లు ఎక్కువగా ఉండేవి. వర్షాకాలంలో ఎక్కడ ఉరుస్తాయో అని భయపడేవారు. వానాకాలానికి ముందే పైకప్పులు సరిదిద్దుకునేవారు. ఒకవేళ ఉరిసినా.. ఇల్లు విడిచేంత పరిస్థితులు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు అన్ని పక్కా ఇళ్లు. డాబాలు, మూడు, నాలుగు అంతస్తుల భవనాలు. వానాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లు విడిచి పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షపు నీటి నిల్వ సామర్థ్యం లేక.. నగరాల్లో కాలనీలకు కాలనీలే నీట మునుగుతున్నాయి. కొందరి ఇళ్లలో సామగ్రి మొత్తం వరదల్లో కొట్టుకుపోయే ధీనస్థితిలో ఆధునిక మానవులు నివసిస్తుండడం అభివృద్ధి చెందుతున్న సమాజానికి నిదర్శనం. అంతస్తుల్లో జీవిస్తున్నా.. దేహీ అని చేతులు చాచాల్సిన దుస్థితికి దిగజారడం మానవుల బుద్ధి కుశలతకు నిలువుటద్దం. రాబోతున్న మరో వానాకాలానికి వరదల్లో చిక్కుకునేందుకు నగరాలు, మహానగరాలు సిద్ధం!! – నమస్తే