ఊరుఊరంతా సందడే సందడి… ఆనాడు భక్త రామదాసు ప్రజల పన్నులతో శ్రీరాముడికి గుడి కట్టించాడు. నేడు బొడ్డుచింతలపల్లిలో గ్రామస్తులంతా కలిసి పలు దేవతామూర్తులకు ఒకే చోట దేవాలయ సమూహం నిర్మించి, నేటి రామదాసులుగా నిలుస్తున్నారు.
కాకతీయుల కాలం నిత్యం పూజాధి కైంకర్యాలు జరిగిన దేవాలయం అది.. రాజ్యాలు, రాజులు మారే తరుణంలో జరిగిన యుద్ధాల ఫలితంగా ధ్వంసమైన ఆ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకున్నా ఆ గ్రామస్థులు.. అందరూ ఏకమై ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కాకతీయుల నిర్మాణ శైలి, ఆగమశాస్త్ర నియమాలు, స్థలపురాణ పద్దతులు అనుసరించి శివరామ క్షేత్రాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.. ఆ ఆలయమే వరంగల్ జిల్లా గీసుగొండ మండలం బొడ్డు చింతలపల్లిలో నిర్మించి ప్రారంభోత్సవ హంగులతో విరాజిల్లుతుంది.
రాచరిక కాలంలో యుద్ధాల ప్రభావం వల్ల ధ్వంసమై, చెల్లాచెదురుగా పడి ఉన్న విగ్రహాలను చూసిన బొడ్డు చింతలపల్లి గ్రామస్థులు ఆలయం యొక్క చరిత్రను గ్రామంలోని వృద్ధులను అడిగి తెలసుకున్నారు. గ్రామస్థులంతా రాజకీయాలను అతీతంగా ఏకమై ఆలయం నిర్మాణానికి 2020లో శ్రీకారం చుట్టారు. గ్రామస్థులు అందరూ ఏకమై తలా ఇంతా విరాళాల రూపంలో సుమారు ఇప్పటివరకు రూ.అర కోటి వరకు అందజేశారు. ఆలయ నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి ప్రారంభోత్సవ తంతు పూర్తయ్యేవరకు దాదాపు రూ.కోటిన్నర వరకు ఖర్చు అయినట్లు ఆలయ నిర్మాణ కర్తలు అయిన గ్రామస్థులు తెలిపారు. ఇందులో గ్రామస్థులు రూ.50 లక్షల వరకు ఇవ్వగా.. మిగిలిన రూ.కోటి దాతల సహకారంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఆలయాల గురించి…
స్వయంభులింగ అవతరించిన ఈ ఆలయం కాకతీయుల భక్తికి తార్కాణంగా నిలిచింది. హిందూ ధర్మాన్ని పరిరక్షించిన కాకతీయుల శ్రద్ధకు నిదర్శనంగా చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి, త్రిశక్తి పీఠం అమ్మవారి ఆలయం గత చరిత్రను మనకు తెలిపే విధంగా ఉంది. ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో ఇప్పుడు గ్రామస్థుల ఐక్యత, ఆర్థిక సహకారంతో పునర్నిర్మితమైనది. కాకతీయుల శిల్పకళా అభిరుచికి ఏ మాత్రం తీసిపోకుండా ఆలయాలు పూర్వ వైభవం ఉండేలా ప్రతిష్ఠాచార్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ఠ జరుగుందని గ్రామస్థులు తెలిపారు.
గ్రామస్తులు నిర్మించిన ఆలయాలు ఇవి..
పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, సీత సమేత రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఆలయం, భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు, చెన్నకేశవస్వామి ఆలయాలను నిర్మించారు.
ఉత్సవాలు ఇలా..
మొదటి రోజు అనగా శుక్రవారం 06న మంగళవాయిద్యాలు, వేదపారాయణం, గణపతి పూజ, జలాధివాసం, ధ్వజారోహనం తదితర కార్యక్రమాలు ఉంటాయి.
రెండో రోజు అనగా శనివారం 07న వాస్తు హోమం, రుద్ర హోమం, శ్రీరామ హోమం, క్షీరాధివాసము, బలిహరణతో కూడిన గ్రామ ప్రదక్షిణ, ధాన్యాధివాసం, వస్త్రాధివాసం తదితర కార్యక్రమాలు.
మూడో రోజు అనగా ఆదివారం 08న గవ్యాంత పూజలు, యంత్ర స్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ట, మహాపూర్ణాహుతి, మహాకుంభాషేకం తదితర కార్యక్రమాలతో ఆలయాలు ప్రారంభించడం జరుగుతుంది దేవాలయ కమిటి నిర్వాహకులు తెలిపారు.