వానాకాలమైనా వాన కోసం మొక్కులు!
ఎండాకాలంలో ప్రతీ రోజూ ఎండే. బయటకు వెళ్లాలంటేనే భయం. చలికాలంలో రోజూ చలి తప్పదు. కొన్ని రోజులైతే వణికిపోవాల్సిందే. అదేంటో వానాకాలమే.. వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. ఒక్కోసారి వానల కోసం పూజలు కూడా చేయాల్సి వస్తుంది. కప్పతల్లి ఆటలు ఆడుతుంటారు. వానలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. గ్రామదేవతలకు జలాభిషేకాలు చేస్తుంటారు. 1994లో అయితే, వానల కోసం మేఘమథనం కూడా చేశారు. ఇక వానలు ఎక్కువగా పడితే వరుణ దేవుడుని తిట్టిపోసుకుంటారు. అయితే, వానలు పడకపోవడాన్ని అనావృష్టిగా, అధికంగా కురిస్తే అతివృష్టి అని పేర్కొంటున్నాం. ఇందుకు కారణాలేవైనా వానలు సమృద్ధిగా పడకపోయినా, ఎక్కువగా కురిసినా మానవాళికి నష్టమే. అయితే, ఈసారి మాత్రం వర్షాలు విరివిగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వెల్లడిరచింది. ఈ మేరకు గత వారం కొన్ని చోట్ల ఒకటీ, రెండు వానలు పడినా.. మళ్లీ వానల జాడే లేదు. ఇప్పటికే దుక్కులు పొతం చేయడంతోపాటు విత్తనాలు, ఎరువులు కూడా కొనుగోలు చేసుకున్న రైతులు మరో రెండు వానలు గట్టిగా పడితే విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగానే వచ్చిన రుతుపవనాలు.. ఆశించిన స్థాయిలో వానలు కురిపిస్తాయా? లేదా? పూజల కోసం ఎదురుచూస్తాయా? వేచిచూడాలి.
– నమస్తే.