
వేలల్లోనే ఓటుకు రేటు!
ఎన్నికల నగారా మోగిందని అనడం కంటే.. ధనలక్ష్మీ దండోరా వేశారనడం సబబుగా ఉంటుందేమో! పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బు పారకమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు లేని డబ్బు కోట్లలోనే పట్టుబడుతోంది. అయినా.. డబ్బు ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఏకంగా నాయకులే.. ఫలానా పార్టీ వారు ఇంత ఇస్తారట.. తీసుకోండి అంటూ బహిరంగంగానే చెప్పడం ఎన్నికల వ్యవస్థతోపాటు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చుతున్నదేమో కదా? అంతేకాదు! మాకు డబ్బులిస్తామని ఇవ్వలేదని, తాము ఓటు వేయమని.. రాద్ధాంతం చేసే వారు కూడా ఉండడం.. ఎన్నికలంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయమేమిటో స్పష్టమవుతోంది. రాజకీయ నాయకుల నుంచి ప్రజలు ఆశిస్తున్నదేమిటో ప్రస్ఫుటమవుతోంది. ఇదీ ప్రపంచంలో అత్యంత విలువ గల రాజ్యాంగం కలిగిన దేశంగా పేరొందిన భారతావనిలో ఎన్నికలకు ప్రజలు ఇస్తున్న విలువ. ఇప్పుడు కాకపోతే.. నాయకులు మరెప్పుడు దొరుకుతారు? మనకేం చేస్తారు? అన్న ఆలోచనల నుంచి ప్రజలు ఎప్పటికీ కళ్లు తెరుస్తారో?
– నమస్తే.
