
ఎన్నికల్లో గెలిచినా ఫెయిలే !
ఎడ్యుకేషన్ మాదిరి ఎలక్షన్లలో కటాఫ్ ఓట్లు పెట్టాలే
ఒక్క నేత కూడా చట్టసభలకు వెళ్ళడు
పరీక్షల్లో 35 మార్కులు వస్తే పాస్ అన్నట్లుగా ఎన్నికల్లో కూడా మొత్తం ఓట్లలో 35 శాతం ఓట్లు వస్తేనే గెలిచినట్లు అనే నిబంధన పెడితే ఒక్క నాయకుడు కూడా చట్టసభలకు వేళ్లడేమో ! అసలు పోటీకి దిగే నాయకులు సైతం కూడా ఉండరేమో ! ఓటుకు లక్ష ఇచ్చినా పాస్ మార్క్ సంపాదించడం కష్టతరమే అవుతుందేమో ! ఒక వేళ ఎన్నికల్లో కటాఫ్ పెడితే ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినట్టు కానే కాదేమో! ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 98,988 ఓట్లు వచ్చాయి. అసలు ఈ నియోజక వర్గంలో మొత్తం 3,90,877 ఓట్లు ఉన్నాయి. ఈ మొత్తం ఓట్లలో 35 శాతం అంటే 1,36,806 ఓట్లు రావాలి. అయితే కాంగ్రెస్ కు 98,988 ఓట్లు మాత్రమే వచ్చాయి. 35 శాతం నిబంధన ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు ఇంకా 37,818 ఓట్లు కావాలి. అప్పటికీ ఆ పార్టీ కేవలం పాస్ మాత్రమే అయినట్లు. అయితే అధికారంలో ఉన్న పార్టీ కావడంతో డిస్ట్రింక్షన్ లెవల్లో విజయం దక్కాలంటే 80 శాతం అనుకున్నా మొత్తం ఓట్లలో 3,12,701 ఓట్లు సంపాదించాలి. కానీ అది అసాధ్యం. అయినా ఆ పార్టీ మిగతా పార్టీలకంటే ఎక్కువ ఓట్లు వచ్చినందుకు గెలిచినట్లే. ఇక కొన్ని పోటీ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఆ నిబంధన కూడా ఎన్నికలకు వర్తింప చేస్తే.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నోటాకు 924 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల నుంచి వీటిని తీసేస్తే మెజారిటీ తగ్గినట్లే. కానీ ఇది రాజకీయం. ఇలాంటి నిబంధనలు పెట్టడం సాధ్యపడదు. అసలు అందుకు రాజకీయ నాయకులే ఒప్పుకోరు. అంతెందుకు, ఎన్నికలలో డబ్బు, మద్యం, ఇతర కానుకలు పంచకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేసినా నోటాకె ఎక్కువ ఓట్లు వస్తాయేమో ! ఇదంతా పక్కన పెడితే ఎన్నికల మాదిరి.. పోలైన ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు పరీక్షల్లో కూడా రాసిన సమాధానాల మార్కులను ప్రామాణికంగా తీసుకుంటే ఫెయిల్ అనే మాటే ఉండదేమో కదా!
–జి.ఎన్.అయ్యగారు.
