
ఎన్నికల కోడ్ వారికి వర్తించదా?
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే చాలు ఎలక్షన్ నియమావళి అమలులోకి వస్తుందంటారు. ముఖ్యంగా పలు పథకాల అమలు నిలిచిపోతుంది. సరైన ఆధారాలు లేకుండా 50వేలకు మించి నగదును తరలించకూడదు. మద్యం నిల్వలు ఎక్కువ మొత్తంలో పెట్టుకోకూడదు. రవాణా చేయకూడదు. డబ్బులు పంచరాదు. ప్రచారం రాత్రి ఏడిరటి తర్వాత చేయొద్దు.. ఇవే అందరికీ తెలిసినవి. ఇక్కడి వరకు బాగానే.. ఉన్నా… అసలు ప్రచారం ఎవరు చేయాలనేది సందిగ్ధత. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయని ఎన్నికల సంఘం చెబుతోంది. మరి.. రాజకీయ నాయకులు ఈ ఎన్నికల్లో ప్రచారం చేయొచ్చునా? అనేది సందేహాస్పదం. ఇప్పటికే ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న వారు.. ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అర్హులా? కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం చేయడం వల్ల ఓటర్లను ప్రలోభానికి గురిచేసే అవకాశం లేదని కచ్చితంగా చెప్పలేం! అలాంటప్పుడు పార్టీలకతీతంగా ఎన్నికలు అని పేర్కొనడం అర్థరహితమే అవుతుంది. అసలు ఓటర్ల ముసాయిదా జాబితా రూపకల్పన సమయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడమే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహిస్తున్నదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇక ప్రచారంలో పార్టీ కండువాలే కప్పుకోకూడదనే నిబంధనలు ఉండగా, ప్రచారానికి ఆయా పార్టీల నేతలకు అనుమతివ్వడంలో ఎన్నికల కోడ్ ఎక్కడుందో? మరి! ఈ విషయంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చి.. నిబంధనలను నిష్పక్షపాతంగా ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
– నమస్తే.
