
మరొకరి సహకారం వెతకడంలో ప్రజలు తలమునకలు!
రేషన్ కార్డు కావాలి.. కాలేజీల్లో సీటు కావాలి.. కులం సర్టిఫికెట్ కావాలి.. నివాస ధ్రువీకరణ పత్రం కావాలి.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ కావాలి.. ఆస్పత్రిలో అడ్మిట్ కావాలి.. మంచి వైద్యం కావాలి.. చిన్నపాటి ఉద్యోగం కావాలి.. కిరాయి ఇల్లు కావాలి.. బ్యాంకులో లోన్ కావాలి.. అన్నిటికీ తెలిసిన వాళ్లు ఉన్నారా? అని ఆరా తీయడం సర్వసాధారణమైంది. భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ఎవరైనా తెలిసిన వాళ్లుంటే బాగుండు.. వేరే ఊరెళ్లాల్సి వచ్చిన.. అక్కడ మనకు తెలిసిన వారు ఉన్నారా? అంటూ గుర్తు చేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులైనా, ప్రైవేటు ఆస్పత్రులైనా తెలిసిన వారుంటే డాక్టర్లు మంచిగా చూస్తారేమో? లేదా బిల్లు తగ్గుందేమో అన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలిసిన వారుంటే తమ పని త్వరగా పూర్తవుతుందనే భావనతో లంచం ఇచ్చేందుకు కూడా వెనుకాడకుండా ప్రజలు అవినీతి, అక్రమాలను ప్రోత్సహించాల్సిన పరిస్థితులు నిత్యకృత్యంగా మారిపోయాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా.. తెలిసిన వారుంటే బాగుండు అనుకునే స్థాయికి ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు దిగజారిపోయాయి. చివరకు ఓటు వేయడంలోనూ తమకు తెలిసిన నాయకులు ఎవరున్నారు? మనకు కచ్చితంగా డబ్బులు వస్తాయంటూ లెక్కలేయడంలో అసలు ఓటు విలువను మరిచిపోతున్నారు. ఈ పరిస్థితులు ఎప్పటికి మారుతాయో? ఎన్నిటికి నిజాలు తెలుసుకుంటారో?
– నమస్తే.
