
ఒక్క రోజు సీఎం?
ఒకే ఒక్కడు సినిమాలా ఎవరికైనా చాన్స్ వస్తే!
కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పటాపంచలయ్యేనా?
ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులెవరో తేలేనా..?
అవినీతి, అక్రమార్కుల జీవితాలు జైలుకెళ్లేనా?
సినిమాలోలాగా అందరు నాయకులు అరెస్ట్ అయ్యేనా?
ఒకే ఒక్కడు సినిమా.. వంద రోజులు ఆడిరది. జనమంతా ఇలాంటి సీఎం నిజంగా ఉంటే బాగుండు అని అనుకునే ఉంటారు. అయితే, సినిమా వేరు నిజ జీవితం వేరు అని కూడా అనుకునే ఉంటారు. నిజానికి జర్నలిస్టుల్లో నేడు అంతటి సామర్థ్యులు ఉన్నారా? లెక్కలు వేసినా దొరకరేమో? ఉన్నా లేకపోయినా.. ఎవరికైనా అవకాశం వస్తే.. సినిమాలో లాగా ప్రభుత్వ పథకాల అమలులో లోపలు బయటపడతాయా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు నిరూపితమవుతాయేమో? ఫోన్‌ట్యాపింగ్ కేసులో అసలు దోషులెవరో ఒక్క రోజు సీఎం తేల్చేవారేమో? రాష్ట్రంలో లంచాలకు మరిగిన అధికారులు, భూ కబ్జాదారుల భరతం పట్టేవారేమో? గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు ఆ ఇళ్లలోనే ఉన్నారా? అమ్ముకున్నారా? అనే విషయం బయటపెట్టేవారేమో? పోలీసుల పనితీరు మెరుగుపరిచే వారేమో? కదా! అసలు ఎవరో వస్తారు? ఏదో చేస్తారని ఎదురుచూసే జనం.. ఇలా సినిమాలు చూసి అహో అని చప్పట్లు కొట్టే బదులు మంచి నాయకులను ఎన్నుకుందామని ఎందుకు ఆలోచించరో? డబ్బు, దసకం ఉన్నవారికే పట్టం కడతారే తప్ప.. ఆ డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంపాదించారు? ఓటు ఎందుకు అమ్ముకోవాలి? ఉచిత పథకాలతో నష్టం జరుగుతున్నదనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో? రాజకీయ నాయకులు మారాలని కోరుకుంటున్న ఓటర్లు.. తమలో మార్పు రావాలని ఎందుకు కోరుకోవడం లేదో? అదే జరిగితే.. అసలైన నేతలెవరో? తేలిపోతుంది కదా? ఒక్క రోజు అందించే వెయ్యి, రెండు వేల రూపాయలకు ఓటు అమ్ముకుని.. సాధించిందేమిటీ? సాధిస్తున్నదేమిటీ?
– జి.ఎన్.అయ్యగార్.
