ఓటు వేయకుంటే సచ్చినట్టే?
అందుకే వాళ్లు ఓటు వేయడం మరిచిపోరు!
వృద్ధులు, ఫ్రీడం ఫైటర్లలో నాటుకున్న అభిప్రాయం!
పోలింగ్‌ రోజున ముందు వరుసలో ఉండేది వాళ్లే
యువత మాత్రం వివిధ సాకులతో ఓటు వేసేందుకు విముఖత?
ప్రైవేటు ఉద్యోగులు సెలవు లేదనే కారణంతో పోలింగ్‌కు దూరం

ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పదేపదే చెబుతూనే ఉంటుంది. అయినా కొంతమంది యువత ఎన్నికల ప్రక్రియను లైట్‌గా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఉద్యోగరీత్యా స్వగ్రామాలకు దూరంగా ఉండడమో లేదా దూరాభారం కారణమో లేదా ప్రైవేటు సంస్థల్లో అందరికీ ఒకేసారి సెలవు ఇవ్వడం కుదరకనో.. ఏదో సాకుతో చాలామంది పోలింగ్‌కు దూరమవుతున్నట్లు పోలింగ్‌ నమోదు శాతం ద్వారా స్పష్టమవుతోంది. పోలింగ్‌ రోజున అన్ని సంస్థలు, కార్యాలయాలు సెలవు పాటించాలనే నిబంధనను ఆయా సంస్థల యాజమాన్యాలు పాటించడంలో నిర్లక్ష్యం వల్ల చాలామంది దూరం కావాల్సి వస్తోందని ఇట్టే అర్థమైపోతోంది. ఇందులో పత్రికలు ఉండడం విచిత్రం. ఓటు విలువను తెలుపుతూ కథనాలు రాస్తూ.. అందరూ తప్పక ఓటు వేయాలని ప్రచారం చేసే మీడియా.. తమ సంస్థల్లోని ఉద్యోగులకు మాత్రం.. పోలింగ్‌ రోజున సెలవు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోరని తెలుస్తోంది. ఇకపోతే.. కొందరు ఓటేస్తే తమకేంటి లాభం అనే ఆలోచనతో కూడా ఓటు వేయడానికి విముఖత ప్రదర్శిస్తుంటారు. ఇదీ నేటి యువత, వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి. కానీ, వీరంతా వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. వృద్ధులు, ఫ్రీడమ్‌ ఫైటర్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓటు వేయకుండా ఉండలేరు. ఓటు వేయకపోతే.. తాము చనిపోయిన వారికిందే లెక్క అనే అభిప్రాయంతో పోలింగ్‌ రోజున సత్తువనంతా కూడదీసుకుని పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు వరుసలో ఉంటారనే విషయం చాలామందికే తెలిసి ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఉచితంగా పింఛన్‌ పొందుతున్న వారు.. ఇదే అభిప్రాయంతో ఓటు వేశాకే వేరే పని పెట్టుకుంటారు. లేదంటే పింఛన్‌ పోతుందేమోనన్న భయం. అసలు.. పోలింగ్‌ శాతంలో ఎంతమంది పురుషులు, ఎంతమంది మహిళలు ఓటు వేశారని అని లెక్కలు తీయడం కాకుండా.. ఎంతమంది వృద్ధులు, ఎంతమంది యువకులు ఓటు వేశారనే లెక్కలు తీస్తే.. యువతలో మార్పు వస్తుందేమో? అలాగే.. పోలింగ్‌ రోజున సెలవు ప్రకటించని సంస్థలు, కార్యాలయాల యజమానులకు కూడా ఓటు విలువేంటో తెలుసొస్తుందేమో?
– నమస్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *