రేటును బట్టి గెలుపు!!
ఓట్ల వ్యాపారానికి సమయం రానే వచ్చింది. జెడ్పీ ఎన్నికల రూపంలో ఓట్ల మార్కెట్‌కు తెరలేవనుంది. పోటీకి దిగేవారిలో ఓట్ల వేలానికి మహూర్తం ఖరారైంది. గెలుపు, ఓటములను శాసించే ఓటరు అమ్ముడుపోవడానికి ‘వేల’ కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎవరు ఎక్కువ రేటు పెడితే.. వారికే పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా.. తర్వాత ఏం జరిగినా.. తనకేంటీ అనే ఆలోచనతో తులాభారానికి సిద్ధమయ్యాడు. పోటీదారులు కూడా ఓటర్లను కొనడానికి ఇప్పటికే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారు. తమ అనుంగు అనుచరులతో అనుకూలమైన ఓట్లను కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల కళ్లు గప్పి.. డబ్బులు పంచేందుకు వ్యూహాలు రచించి పెట్టుకున్నారు. ప్రత్యర్థులు పంచేదానికంటే పైచేయిగా ఓట్లు బుట్టలో వేసుకునేందుకు పక్కా ప్రణాళికలు వేసుకున్నారు. ఎంపీటీసీ స్థానానికి 500 నుంచి వెయ్యి, జెడ్పీటీసీకి వెయ్యి నుంచి 1500 చెల్లించేందుకైనా వెనకడుగు వేయకుండా ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధం చేసేసుకున్నారు. నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండడంతో మండల స్థాయిలో ఓట్ల వ్యాపారం జోరుగా సాగనుంది.