ఓవర్‌ లోడ్‌ను అడ్డుకునేదెవ్వరు?
ఓవర్‌ లోడ్‌కు కారణం ఎవరు?
ఆర్టీఏ అధికారులా? పోలీసులా?
అతి వేగానికి బాధ్యులు ఎవరు?
నియంత్రించాల్సిన విధులెవరివి?
రోడ్డు ప్రమాదాలపై తలోమాట!
రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగినా మితిమీరిన వేగమో లేదా మద్యం మత్తులో వాహనం నడపడమో లేదా పరిమితికి మించి సరుకు రవాణా చేయడమో కారణంగా పేర్కొంటుంటారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు, టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదానికి టిప్పర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మోతాదులో కంకర తరలించడంతోపాటు వాహన వేగం కూడా కారణమని పత్రికలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించారు. అలా ఓవర్‌లోడ్‌ రవాణాకు వత్తాసు పలుకుతున్నదెవరనేది? సాకులు చెప్పేవారు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇసుక రీచ్‌లలో లారీ లేదా టిప్పర్‌ సామర్థ్యానికి మించి ఇసుక నింపుతున్న విషయం ఎవరికీ తెలియంది కాదు. ప్రతీ అదనపు బకెట్‌కు అదనంగా డబ్బులు తీసుకుని రీచ్‌ల్లోనే ఎక్కువ మోతాదులో లారీల్లో నింపుతున్నారు. వాస్తవానికి ఇక్కడే అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. లెక్కలోకి రాని అదనపు బకెట్‌ డబ్బులకు ఆశపడి రీచ్‌ బాధ్యులు ఓవర్‌లోడ్‌కు మొదటి కారకులుగా నిలుస్తున్నారు. రెండో దశలో చెక్‌పోస్టులు.. అక్కడా డబ్బులకు కక్కుర్తిపడి వదిలేస్తున్నారు. మూడోస్థాయి పోలీసులు, ఆర్టీఏ అధికారులు.. తమ తనిఖీలు ఓవర్‌లోడ్‌ వాహనాలు దొరికితే జరిమానా విధించడమో లేదా నోటికి వచ్చినంత డిమాండ్‌ చేసి నోట్లు నొక్కడమో చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇలా ఒక ఇసుక వ్యాపారంలోనే కాదు, గ్రానైట్‌ తయారీకి ఉపయోగించే పెద్దపెద్ద బండలు రవాణాలోనూ ఓవర్‌లోడ్‌ తప్పనిసరిగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలోనూ ఓవర్‌లోడ్‌ కనిపిస్తూ ఉంటుంది. మిర్చి, పత్తి బస్తాలతో వెళ్లే లారీలు కొన్ని.. ఓవర్‌లోడ్‌తో రోడ్డు మీద నాట్యం చేస్తూ ఇతర వాహనదారుల్లో భయం పుట్టేలా వెళ్తుండడం గమనించే ఉంటారు. ఇక వాహన వేగంను నియంత్రించాల్సింది ఆర్టీఏ అధికారులు. భారీ వాహనాలకు లిమిటెడ్‌ స్పీడ్‌ ఉండేలా చర్యలు తీసుకుంటే.. మితిమీరిన వేగం నమోదయ్యే అవకాశమే ఉండదు. కానీ, ఈ దిశగా ఎవరూ ఆలోచించరు. ఈ విషయాలను విస్మరించి, ప్రమాదం జరగగానే… వాహనదారులదే తప్పు అంటూ తమను తాము కప్పిపుచ్చుకునే ప్రకటనలు చేయడం తెలివి మీరినతనంగా భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అంటూ.. జరిమానాలు అంటూ హడావుడి మానేసి.. ఓవర్‌లోడ్‌.. వేగపరిమితులపై దృష్టి సారిస్తే.. భారీ వాహనాలతో జరిగే ప్రమాదాలకు ఆదిలోనే చెక్‌పెట్టవచ్చు!