జాగృతి సైన్యం ముందు నడిచేనా?
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జూన్ 11న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆయన్ను ఏం ప్రశ్నలు వేయనుంది. కేసీఆర్ ఏం చెబుతారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పాలా? లేదా కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, నిర్మాణం తీరు గురించి వివరించే అవకాశం ఉంటుందా? కేసీఆర్ చెప్పిన సమాధానాలకు కమిషన్ సరే అంటుందా? అసలు రిపోర్టు ఎలా ఉండనుంది? అనే సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. ఇదిలా ఉండగా, జూన్ 11న కేసీఆర్ ఒక్కరే కమిషన్ కార్యాలయానికి వెళ్తారా? ఆయన వెంట గులాబీ శ్రేణులు వెళ్తారా? జాగృతి సైన్యం ముందు కదులుతుందా? అంతకుముందే పోలీసులు ఏమైనా ఆంక్షలు విధిస్తారా? లేదంటే కీలక నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత కావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం లేకపోలేదు. అదీగాక, జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జాగృతి శ్రేణులు కూడా కదిలివచ్చే చాన్స్ కూడా ఉంటుందా? ఈ తరుణంలో బీఆర్‌ఎస్ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు, జాగృతి ఆలోచనలపైనే కేసీఆర్ వెంట బలగం వస్తుందా? లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి. – నమస్తే.