కొసరు అడగలేం! మొగ్గు చూడలేం!! ఈ- కాంటాలతో తూకం సరిసమానం ఎక్కువ శాతం సరుకులు ప్యాకెట్లలోనే లభ్యం అడగలేని పరిస్థితుల్లో వినియోగదారులు
భోజనాల వేళ కొందరు కొసరి కొసరి వడ్డిస్తుంటారు. కూరగాయలు కొనేటప్పుడు కొసరు వేయకుంటే కూర రుచి రాదు.. అని పెద్దలు అనేవారు. అదే పద్ధతిలో ఒకప్పుడు ఏది కొన్నా కొసరు అడగడం అలవాటుగా ఉండేది. అలాగే దుకాణాల్లో మొగ్గు చూసి కొనేవాళ్లు. పావుకిలో పప్పు కొన్నా తరాజు అటే పోతోంది.. కొంచెం ఎయ్యి అని జబర్దస్త్‌గా అడిగేవారు. కొన్ని సందర్భాల్లో షావుకారులే మొగ్గు ఇయ్యమనే పరిస్థితులు ఉండేవి. మరి ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ – కాంటాలు మొగ్గు అడగానికి మొహమాటం అడ్డుగా మారాయి. అదీగాక, ఎక్కువ శాతం సరుకులు ఇప్పుడు ప్యాకెట్లలోనే లభ్యమవుతున్నాయి. ఫలితంగా మొగ్గు మాటే కరువైంది. ఒకప్పుడు కిలో మంచినూనే అంటే 500 మిల్లీలీటర్ల పావుతో రెండు సార్లు ఆపై 25ఎంఎల్ పావు నూనే పోసేవారు. కానీ, ఇప్పుడు అంతా ప్యాకెట్లు, క్యాన్లలోనే లభ్యమవుతోంది. పప్పులు, ఉప్పు, చింతపండు, బియ్యం.. వగైరా సరుకులన్నీ ప్యాకింగ్ రూపంలోనే విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో కుల్లా దొరికినా.. ఈ -కాంటాలతో సరిసమానంగా తూకం వేస్తున్నారు. పావుకిలో అంటే 250గ్రాములే జోకుతున్నారు. కొంచెమంత వేయరాదూ.. అనే అడిగే పరిస్థితులు ఎప్పుడో మాయమయ్యాయి. కూరగాయలు కూడా సరాసరి తూకం వేస్తున్నారు. మామూలు తరాజు ఉంటే ఒకటి, రెండు కాయలు ఎక్కువేసి ఇచ్చే వారు ఒకప్పుడు. ఈ ` కాంటాల విధానానికే వినియోగదారులు కూడా అలవాటు పడిపోయారు. డీమార్టు, రిలయన్స్, ఇతర షాపింగ్ మాల్స్‌లో మరీ విచిత్రం. ఎవరి సరుకులు వారే తూకం వేసుకోవాలి. కిలోకు ఒక గ్రాము ఎక్కువ ఉన్నా.. దానికి డబ్బులు కట్టాల్సిందే. ఇదీ నాటికి.. నేటికీ తూకంలో వచ్చిన మార్పులు. ఈ వ్యవస్థ ధనవంతులకు సరైనదే అయినా.. మధ్య, సామాన్య తరగతి, నిరుపేద కుటుంబాలకు మొగ్గు, కొసరు లేకపోవడం అసంతృప్తే మరి!