• ఇందిరమ్మ ఇళ్లు!
    చిటారు కొమ్మన మిఠాయి పొట్లం!!
    ఇళ్లు లేని వారికి గృహ వసతి కల్పించాలనే పాలకుల ఆశయం సరైనదే. కానీ, వాటి లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004లో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అదే క్రమంలో రాజీవ్‌ గృహకల్ప స్కీంను కూడా ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రభుత్వం వేలకొలదీ ఇళ్లు, పదుల కొద్దీ అపార్టుమెంట్లు నిర్మించింది. ఏపీ విభజన అనంతరం తెలంగాణలో 2014లో పాలనా పగ్గాలు చేతబట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా డబుల్‌ బెడ్రూంల స్కీం తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరిట పథకాన్ని ఆరంభించింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద ఇళ్లు నిర్మిస్తోంది. ఇలా.. 2004 నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తూనే ఉన్నాయి. అయినా.. ఇంకా ఇళ్లు లేని వారు లక్షల్లోనే లెక్కతేలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతీ ప్రభుత్వం ఇళ్ల లబ్ధిదారులను నిజాయితీగా ఎంపిక చేస్తున్నామని చెబుతున్నారు. మరి.. 21 ఏళ్లుగా ఇళ్లు నిర్మిస్తున్నా అసలు లక్ష్యం ఎందుకు నెరవేరడం లేదో అర్థం కావడం లేదు. తాజాగా, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నామని చెబుతోంది. కానీ, రాష్ట్రంలో అసలు ఇళ్లు లేనివారు ఎంతమంది అనే లెక్కలు తీస్తే.. ఎన్ని ఇళ్లు కట్టించాలనే సంగతి తేలుతుంది. అంతేగానీ, ఇప్పుడు 2లక్షలు, మరో సంవత్సరం మరో రెండు లక్షలు అంటూ కట్టించుకుంటూ పోతే.. ఈ పథకం చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా మారిపోతుందే తప్ప.. అసలు లక్ష్యం నెరవేరడం గగనమే అవుతుంది. 2004లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలామందికి నివాస స్థలాలు పంపిణీ చేసింది. వీరిలో చాలామంది అప్పట్లోనే అమ్మేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరంతా ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా తమకు ఇళ్లు లేవని మళ్లీ దరఖాస్తుల్లో ముందు వరుసలోనే ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇలా ఒకసారి ఇల్లు, ఇంటి స్థలాలు తీసుకున్న వారు కూడా పదేపదే ఇళ్ల పథకానికి ముందుకొస్తే.. భూమండలం మొత్తం ఇళ్లు కట్టించినా సరిపోవు. అందుకే ముందు అసలు ఇళ్లు లేని వారు ఎందరో లెక్కలు తీసి.. ఆ తర్వాత ఇల్లు కట్టిస్తే గానీ.. లక్ష్యం నెరవేరదు.
    – నమస్తే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *