చిన్నప్పుడు ప్రశ్నిస్తే తెలివి! పెద్దయ్యాక ప్రశ్నిస్తే అతితెలివి!!
చిన్నప్పుడు.. ఏ ప్రశ్న వేసినా తెలివిగల వ్యక్తిగా చూసేవారు. ఇంట్లో పెద్దవాళ్లు ముద్దులతో ముంచెత్తేవారు. పాఠశాలల్లో అయితే మెచ్చుకునేవారు. అదే పెద్దయ్యాక ప్రశ్నిస్తే.. అతి తెలివి అంటున్నారు. కబ్జాలకు పాల్పడిన వారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. లంచం ఎందుకు ఇవ్వాలని అడిగితే అధికారులపైకి తిరగబడుతున్నారని అంటున్నారు. మాకెందుకు పథకాలు ఇవ్వరని నిలదీస్తే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారని ముద్రవేస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని అడిగితే సంఘవిద్రోహులు అని అంటున్నారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. పాఠశాల స్థాయిలో మాత్రం ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలంటారు. పెద్దయ్యాక ప్రశ్నిస్తే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. సాధారణ ప్రజల విషయం ఎలా ఉన్నా.. జర్నలిజం అంటేనే ప్రశ్న.. జవాబుల ఉద్యోగం. ఉద్యోగ రీత్యా ఏ ప్రశ్న అడిగినా ఏ పేపర్, ఏ ఛానల్ అంటూ కించపరుస్తున్నారు. అసలు ప్రశ్నలోనే తప్పున్నదంటూ తప్పుగా మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ప్రశ్నించడం తప్పా.. ప్రశ్నించే వ్యక్తులది తప్పా.. ప్రశ్నలు ఎదుర్కొనేవారిది తప్పా. ప్రశ్నించాలని చెప్పే వారిది తప్పా! ప్రశ్న లేదనుకుంటే పరీక్షలే ఉండవు. ప్రశ్నే లేదనుకుంటే ఆర్థిక, సామాజిక, సాంకేతిక పురోభివృద్ధే లేదు. ప్రశ్నే లేదనుకుంటే మానవ మేథస్సే వృథా. ప్రశ్నే లేదనుకుంటే అసలు సృష్టే శూన్యం! – నమస్తే.