జైజవాన్.. జై‘కిస్సా’న్!
ఈ నినాదం భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి 1965లో చేశారు. రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నినాదానికి ఆయన పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జవాన్లు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ భారత ప్రజానీకానికి రక్షణగా నిలుస్తున్నారు. ఇక యావత్ ప్రజానీకానికి ఆహారం అందించేది రైతులే. వ్యవసాయమే లేకుంటే.. మానవ మనుగడ ప్రశ్నార్థకమే. అవసరమైతే.. ప్రజలు సైనికుల్లా మారుతారేమో గానీ.. ప్రతీ ఒక్కరూ వ్యవసాయం చేయలేరు. అందుకు ఓపిక, సహనం, నేర్పు ఎంతో అవసరం. అన్నిటికి మించి నేలతల్లిని ప్రేమించే వారికే వ్యవసాయం సొంతమవుతుంది. మరి అలాంటి రైతులను ప్రభుత్వం ఏమేరకు ఆదుకుంటోంది. వారి సంక్షేమానికి ఎలాంటి సహకారం అందిస్తోంది? సందేహాత్మక సమాధానాలే వస్తాయేమో! పంట ఉత్పత్తుల ధరలపై ఇప్పటికీ రైతుల్లో నుంచి ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించడంలోనూ వ్యాపారులు కుంటిసాకులు వెతుకుతూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులను కుంగదీస్తూనే ఉన్నాయి. రైతు భరోసా, రైతుబంధు, రుణమాఫీ చేస్తున్నా.. రైతుల ఆత్మహత్యలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. అందుకు గల కారణాలను అన్వేషించలేకపోతున్నారు. అదీగాక, రైతులు సాగు చేసుకుంటున్న భూములను అభివృద్ధి పేరిట లాగేసుకుంటూ వ్యవసాయ విస్తీర్ణం తగ్గేలా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ రైతుల సంక్షేమం కోసం పాలకులు తీసుకునే చర్యలు శూన్యమనే చెప్పుకోవాలి. జవాన్లలాగా రైతులకు ప్రత్యేక స్టోర్స్ ఏర్పాటు చేసి వారికి కూడా సబ్సిడీపై అన్ని వస్తువులు అందించాలి. రైతుల పిల్లల కోసం ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే రైతులకు గౌరవ భత్యంగా ప్రతీ నెలా కొంత డబ్బు అందించేలా చూడాలి. అసలు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, సంక్షేమనిధి రూపొందించాలి. అలా చేసినప్పుడే జైజవాన్.. జైకిసాన్ నినాదానికి అర్థం చేకూరుతుంది. – నమస్తే.