
తగ్గిన ధరలతో తులం బంగారం వస్తదా?
సబ్బుల రేటు తగ్గిందని, రోజుకొక్క సబ్బు అరగదీయగలమా?
సబ్బుల్లో మిగిలే పైసలతో సిమెంట్ బస్తా కొనగలమా?
చెప్పుల ధరలు తగ్గాయని.. జీవితానికి సరిపడా కొనుక్కోవాలా?
జీఎస్టీ సంస్కరణలతో నిరుపేదలకు ఖరీదైన జీవితం అందేనా?
సెప్టెంబర్ 22, 2025 నుంచి పలు రకాల సరుకులు, వివిధ వాహనాల రేట్లు తగ్గనున్నాయని కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రచారం చేస్తోంది. ప్రధానమంత్రి నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెగ పోస్టింగులు పెడుతున్నారు. జీఎస్టీ సంస్కరణలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని గొంతుచించుకుంటున్నారు. మరీ.. తగ్గిన ఆ ధరల ద్వారా మిగిలే డబ్బులకు తులం బంగారం వస్తుందా? పోనీ సబ్బుల రేటు తగ్గిందని రోజుకొక్క సబ్బును వాడగలరా? సబ్బులపై మిగిలిన డబ్బుతో సిమెంట్ బస్తా కొనగలరా? వంట నూనే రేటు తగ్గిందని.. మంచినీళ్లలా తాగగలమా? చెప్పుల ధరలు తగ్గాయని.. జీవితానికి సరిపడా చెప్పులు ఇప్పుడే కొనుక్కోవాలా? జీఎస్టీ తగ్గిందని, ఇంటి కిరాయిలు తగ్గేనా? బస్సు చార్జీలు తగ్గేనా? ఆస్పత్రుల్లో బిల్లులు తగ్గేనా? మా అంటే.. సామాన్యుడి నెలవారీ ఖర్చులో ఒక రూ.500 మిగులుతుందనుకుందాం! ఆ మిగిలిన రూ.500తో ఉన్నపళంగా ఖరీదైన జీవితం అనుభవించగలడా? తగ్గిన ధరలకు, తగ్గించామంటున్న తలకాయలకే తెలియాలి.
– జి.నమస్తే.
