
రాజకీయ పార్టీల జెండాలతో జాతీయ పతాకం రంగులకు మచ్చ
పార్టీలకు జాతీయ జెండా తరహా రంగులు లేకుండా చూడాలి
జాతీయ పతాకం.. 120 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక. మూడు రంగుల జెండా కనపడగానే భారతీయుల రోమాలు నిలబడతాయి. ఆ జెండా రెపరెపలు చూసి ఆబాలగోపాలం మురిసి పోతుంది. అయితే, జాతీయ జెండా రంగులను పోలిన జెండాలు రాజకీయ పార్టీలు ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలు అయోమయానికి గురికావల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, కొన్ని సార్లు ఆయా పార్టీల జెండాలు వీధుల్లో, రోడ్లమీద, చెత్తకుప్పల మీద దర్శనమిస్తుండడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. వాస్తవానికి జాతీయ జెండాను కింద పడేయడం గానీ, తొక్కడం గానీ, నలపడం గానీ చేసినా నేరంగా పరిగణిస్తారు. దేశద్రోహం కింద భావిస్తారు. మరి జాతీయ జెండా రంగులను పోలిన జెండాలు కింద పడడం వల్ల భారత పతాకానికి ఒకింత మచ్చలా మారుతోంది. న్యాయకోవిదులు.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. రాజకీయ పార్టీలకు జాతీయ జెండా రంగులకు పోలిక లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. దూరంగా చూసి.. ఏ జెండానో గుర్తు పట్టలేక ఆందోళన చెందడమే కాకుండా, ఇతర దేశీయులు.. భారతీయ ఆత్మగౌరవాన్ని కించపరిచే అవకాశం ఉంటుందేమో?
- జి.ఎన్.అయ్యగారు
