దొరలు వాళ్లే! దోపిడీదారులు వాళ్లే!!
దొరికితే దొంగ.. లేదంటే దొర! ఈ నానుడి ఎవరిని ఉద్దేశించి పుట్టుకొచ్చిందో గానీ, ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులకు సరిగ్గా సరిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు దొరల్లా, అధికారం పోయాక దోపిడీదారులుగా చిత్రీకరించబడుతున్నారు. 30, 40 ఏళ్ల కిందటి పరిస్థితులను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అవినీతిలో రాజకీయ నాయకుల ప్రమేయం నానాటికీ పెరుగుతూనే ఉంది. గతంలోని కొందరు ప్రజాప్రతినిధులు అడ్డమైన గడ్డితిని జైలు శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం జైలు జీవితం గడిపిన వారూ ఉన్నారు. గడిపేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని నిస్సిగ్గుగా చెబుతున్న వారూ ఉన్నారు. ఇలా ప్రజలను పాలించే నేతలు, పరిపాలనలో జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే ప్రజల సొమ్ము కాజేసిన వారిగా చిత్రీకరించబడుతుంటే మున్ముందు కాలంలో ప్రజాస్వామ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు చోటుచేసుకోనున్నాయో! – నమస్తే.