
రాజకీయ పార్టీలన్నీ సోంచాయించాలె
సమయం వృథా చేయడంలో నేతలే సాటి
సభలు, సమావేశాలకు గంటల తరబడి ఆలస్యం
ప్రజల సమయంతో గర్వం ప్రదర్శిస్తున్న నాయకులు
పోలీసులకూ తప్పని నిరీక్షణ, భద్రత బాధ్యతల్లో తలమునకలు
గర్వంగా ఫీలవుతారో ఏమో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బహిరంగ సభలు, అధికారిక సమావేశాలకు ఆలస్యంగా రావడం సర్వ సాధారణమై పోయింది. ఫలానా రోజున, ఫలానా సమయమని నెల రోజుల ముందు నుంచే ప్రచారం చేస్తారు. తీరా సమయానికి హాజరుకావడానికి కాళ్లు కదలవేమో ఆలస్యంగా వస్తుంటారనేది అందరికీ తెలిసిందే. బహిరంగ సభలకైతే.. జనం కొందరు జిల్లాలు దాటి మరీ చేరుకుంటారు. గంటల తరబడి నాయకుడి కోసం వేచిచూడాల్సిన పరిస్థితులు ప్రజలకు తెలియంది కాదు. మరి.. నాయకులు ఎందుకు ఇలా చేస్తారో? అర్థం కాని పరిస్థితి. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి వెనుకాడని ప్రభుత్వాలు.. వాటి ప్రజాప్రతినిధులు.. వారు నిర్వహించే సభలకు మాత్రం గంటల తరబడి లేటుగా వచ్చినా.. ప్రజలు వేచిచూడాలి. అంతేకాదు, ఆ సభలు, సమావేశాలకు ఆలస్యంగా బయలుదేరినా.. ప్రొటోకాల్ పేరిట ట్రాఫిక్‌నంతా నియంత్రించి.. వెళ్లే నేతలు తమ కోసం జనం వేచిచూస్తుంటారనే ఆలోచన లేకపోవడం వారి విజ్ఞతకే వదిలేద్దాం. అయితే, ఇతరుల సమయాన్ని తమ గర్వం కోసమో, మరే కారణం చేతనో.. వృధా చేయడం సరికాదనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు ప్రాధాన్యం లేదనేది తెలిసిందే. బహిరంగ సభలకు జిల్లాలు దాటి రైతులు, ప్రజలు, అభిమానులు తమ పనులను వదులుకుని వస్తుంటారు. అందుకు వారికి తాము డబ్బులు ఇస్తున్నామని నాయకులు అనుకోవచ్చు.. కానీ, ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయకపోతే.. కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసేది ఎవరు? తాము డబ్బులిచ్చామని, గంటల తరబడి వేచి ఉండాలని భావించడం నేతల అతి పోకడలకు నిదర్శనమే అవుతుంది. పైగా నేతలు వచ్చే వరకు సభకు హాజరైన జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు ఎంత తలనొప్పి అవుతుందో.. అటు నాయకులకు, ఇటు ప్రజలకు తెలియంది కాదు. మరి ఈ విషయంలో నేతలు మారుతారో లేదా ప్రజలే మారుతారో? ఒకవేళ ప్రజల్లోనే మార్పు వచ్చి.. కనీసం ఒక్కసారైనా నేతలు ఆలస్యంగా రావడం పట్ల నిరసనగా సభ ప్రాంగణం నుంచి వెళ్లిపోతే.. నేతలు ఖాళీ కుర్చీలకు తమ ప్రసంగం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటికైనా నేతల్లో మార్పు రాకపోతే.. కుక్క తోక వంకరను ఎవరం మాత్రం సరిచేయగలమని.. ప్రజలే శాశ్వత పరిష్కారం వైపు దృష్టిసారించాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోవాలన్నా ప్రజలతోనే సాధ్యమవుతుందనేది అందరి వాదన. అందుకు ప్రజలు ఈ సభలు, సమావేశాల్లో నేతలు ఆలస్యంగా రావడంపై దృష్టి సారించి.. ఒక మార్పును ఆహ్వానిస్తారని కోరుకుందాం!
-నమస్తే.
