• నాయకుల నుంచి న్యాయపాలన దిశగా..
  • ప్రభుత్వం, పాలకులు కోర్టులకెళ్లాల్సిన పరిస్థితి
    దాయాది దేశంలో ఒకప్పుడు సైనిక పాలన కొనసాగింది. అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం పాలనా పగ్గాలను చేతుల్లోకి తీసుకుంది. అదేతరహాలో మన దేశంలో న్యాయపాలన సాగనుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు కూడా కోర్టుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడమే ఇందుకు కారణంగా అనిపిస్తోంది. ప్రజలకు న్యాయమైన పాలన అందించాల్సిన పాలకులే కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్‌ విధుల నిర్వహణపై కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఇప్పటికీ కోర్టుల ముందున్నాయి. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో రాజకీయ కేసుల విచారణలో పోలీసులు బిజీగా ఉండడం.. ప్రభుత్వాల పాలనలో లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ప్రభుత్వ భూములు, ప్రజల భూములకు పాలకుల సరైన రక్షణ కల్పించకపోవడంతో భూవివాదాలు కోర్టుల్లో మగ్గుతున్నాయి. కొత్తకొత్త చట్టాలు రూపొందించినా.. అమలులో నిర్లక్ష్యం మూలంగా కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. భవిష్యత్‌లో ప్రభుత్వాలు సరిగా పాలించడం లేదంటూ ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే.. అప్పుడు న్యాయదేవతే పాలన పగ్గాలు చేపడుతుందేమో!
    – నమస్తే.