నిజం నీళ్లకే తెలుసు! ముంపు ప్రజలకు తెలుసు!!
వాన.. ఎప్పుడు ఒక గంట గట్టిగ కొట్టినా పలు నగరాలు నీట మునగడం చూస్తుంటాం. వానాకాలం చెప్పనవసరం లేదు. ముంపు ప్రాంతాల ప్రజలు ఇళ్లు వదిలి పోవాల్సిన పరిస్థితులు. మరి ఈ ఏడాది వర్షాకాలంలో వానలు అధికంగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. తాజాగా, వేసవిలో కురిసిన అకాల వర్షానికి ముంబై, హైదరాబాద్ నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ నగరాలతోపాటు చిన్నచిన్న నగరాల్లో పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకం. ముంపు జాబితాలో వరంగల్ నగరం కూడా ఉంది. అయితే, ముంపునకు కారణం.. నీటి ఆవరణ వ్యవస్థను కబ్జా చేయడమేనని ముక్కుసూటిగా చెప్పొచ్చు. చెరువు, కుంటల శిఖం భూములను ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. నీరు పల్లమెరుగు అన్నట్లుగా.. వర్షపు నీరు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతోంది. ఏటా తన ఆవరణను కబ్జా చేశారని వర్షపు నీరు గుర్తు చేస్తున్నా.. తప్పించుకుని తిరుగుతున్నామే తప్ప.. ముంపును నివారించలేకపోతున్నాం. ఎందుకంటే నిజం నీళ్లకే తెలుసు. ఎటు ప్రవహించాలో, ఎక్కడికి చేరాలో వరద ప్రవాహానికే తెలుసు! అందులో మునగడం అక్కడున్న ప్రజానీకానికే తెలుసు!