
- పదకొండేళ్ల పసి తెలంగాణ!
లక్ష్యం చేరుకోని అసలు నినాదం
తెలంగాణ ఆవిర్భవించి నేటికి పదకొండేళ్లు పూర్తయింది. అయినా అసలు నినాదం లక్ష్యానికి చేరుకోలేదు. తెలంగాణ ఉద్యమం చేపట్టిందే నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదంపైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ఉద్యోగావకాశాలు కూడా లేవని, అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమం సాగింది. ఎందరో యువకుల ప్రాణత్యాగాల పునాదులపైన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ, అసలు నినాదం అమలుకు నోచుకోలేకపోయింది. కృష్ణాజలాల్లో మన వాటా ఇంకా తేలనేలేదు. తాజాగా గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక నిధుల విషయానికి వస్తే.. అప్పులే మిగిలాయని పాలకులే చేతులెత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే అప్పులు చేయాల్సి వస్తోందని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. ఇక నియామకాల నినాదం సరేసరి. ఇప్పటికీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇంటికో ఉద్యోగం అని హామీలిచ్చిన నాయకులు.. ఆ మాటే మరిచిపోయారు. ఈ విషయం పక్కన పెడితే.. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి జీవనాన్ని ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. నిరుపేద కుటుంబాలను అగమ్యగోచరంలో పడేశాయి. సంక్షేమ పథకాలంటూ ప్రకటించిన పాలకులు.. వాటిని అమలు చేయడంలో ఆర్థిక సమస్యల సాకుచూపుతుండడం.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులే దాపురించాయి. ఇదీ పదకొండేళ్ల పసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు నిల్వ ఖజానాతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారడం.. సంక్షేమ పథకాల అమలుకు మీనమేషాలు లెక్కించడం.. దయనీయస్థితికి అద్దం పడుతోంది.
– నమస్తే
