పదవులకు పెద్దలు.. పథకాలకు పేదలు!
పదవులంటే ఎవరికి ఇష్టం ఉండదు. వార్డుమెంబర్ కూడా తాను సర్పంచ్ కావాలనుకుంటాడు. సాధారణ కార్యకర్త సైతం.. తాను మండల అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటాడు. ఇలా రాజకీయాల్లో పదవుల పందేరం సాగుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలవాలని కాంక్షించే వ్యక్తి గెలిచాక మంత్రి పదవి కావాలని తాపత్రయ పడుతుంటాడు. మంత్రి అయ్యాక.. ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటాడు. ఇలాంటి పదవుల కోసం పాకులాడే నాయకులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. వీరంతా పదవుల కోసం తమను తాము పెద్దలుగా చూపించుకుంటారు. రాజకీయాల్లో తనకున్న అనుభవాన్ని గొప్పలుగా చెప్పుకుంటారు. అదే ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాల విషయంలో మాత్రం తాము పేదలమని చెప్పుకోవడానికి కొందరు కిందిస్థాయి నాయకులు ఏమాత్రం సిగ్గుపడరు. అవకాశం వచ్చిందంటే చాలు.. పథకాల జాబితాలో తమ పేరు ముందు వరుసలో ఉండేలా చూసుకునేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంటారు. అలాంటి వారి విషయంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. అధికారులను ప్రశ్నించేలా చేస్తోంది. – నమస్తే.