రాజకీయ వారసత్వంలా పంచలేకపోతున్న పంచెకట్టు!
పంచెకట్టు నాయకులు ఒకప్పుడు చాలామంది ఉండేవారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే పంచెకట్టు నేతలే ఎక్కువగా ఉండేవారు. తలపండిన నేతలంతా తెల్ల ధోతీ, తెల్ల లాల్చీ ధరించి.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించేవారు. టీడీపీలో కేవలం ఆ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు మాత్రమే పంచె ధరించే వారు. ఆ పార్టీలో ఒకరిద్దరు పంచెకట్టినా.. ఎన్టీఆర్ తర్వాత అంతా ప్యాంటు నేతలే. ఇక పంచెకట్టుకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా ఉండేది. పంచెకట్టుకే వన్నె తెచ్చినట్టుగా మహామహులు ధోతీ, లాల్చీ ధరిస్తే ఆ హుందాతనమే వేరుగా అనిపించేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని చూస్తే ఆ హుందాతనం ఉట్టిపడేది. ఆ మహానేతకు జోడిగా డీఎస్.. ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు కలిసి పంచెకట్టులో ప్రజలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి తర్వాత కొణిజేటి రోశయ్య.. పంచెకట్టులోనే కనిపించేవారు. రానురాను కాలంతో కల్చర్ కూడా మారింది. ప్యాంటు నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం పంచెకట్టు నేతలను వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఈటెల రాజేందర్ మాత్రమే పంచెకట్టులో కనిపిస్తున్నారు. మిగతా వారిలో కొందరు సీనియర్లు అడపాదడపా పంచె కట్టినా.. వైఎస్, డీఎస్ జోడీ అంతా ఫేమస్ కాలేకపోయారు. ఒకసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా పంచెకట్టులో కనిపిస్తే ఎలా ఉన్నా..? తమ రాజకీయ వారసత్వాన్ని పంచుతున్న నేతలు.. పంచెకట్టును మాత్రం పంచలేకపోతున్నారు. మరో పదేళ్లలో రాజకీయాల్లో పంచెకట్టు కనిపించదేమో?!