• ఎన్టీఆర్ హయాంలో రూ.2కు కిలో రేషన్ బియ్యం
  • నేడు కాంగ్రెస్ హయాంలో ఉచితంగా పంపిణీ
  • నాటికి నేటికి నిరుపేదల బియ్యం కొనుక్కోలేని దుస్థితి?
  • ఇదేనా స్వతంత్ర భారతదేశ ఆర్థిక ఔన్నత్యం
    మహామహుల ఆర్థిక సంస్కరణలు ఏమవుతున్నట్టు?
    కేంద్రం బడ్జెట్ లక్షల కోట్లు.. రాష్ట్ర బడ్జెట్ కూడా ఇంచుమించు అంతే. అయినా.. భారతదేశంలో నిరుపేదలు బియ్యం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ ప్రభుత్వాలు ఉచితంగానే అందిస్తున్నాయి. అదే విషయాన్ని పదేపదే గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. దేశంలో నిరుపేదల ఆర్థిక స్థితిగతులపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షలు, వేలల్లో వేతనాలు, వందల్లో కూలీ ఉన్నా.. కనీసం బియ్యం కూడా కొనలేని పరిస్థితులు ఉండడం విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు 1980 దశకంలో నిరుపేదలు కంట్రోల్ బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదనే వాదనలు ఉన్నాయి. అప్పట్లో రేషన్ బియ్యం కిలో రూ.6కు విక్రయించేవారు. అయితే, ఆ కాలంలో నూతనంగా ఆవిర్భవించిన టీడీపీ.. ఎన్నికల హామీలో భాగంగా రూ.2కు కిలో బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొంది. ఆ హామీ అప్పటి పరిస్థితులకు అవసరమే అనిపించిందేమో.. పేద ప్రజానీకంలో ఒకింత సంతోషమే నెలకొంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇక అప్పటి నుంచి పార్టీలు పేదలపై పథకాల వరాలు కురిపిస్తున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా రేషన్ బియ్యంను ఉచితంగా అందిస్తున్నాయి. అంటే.. పార్టీలు పేదల ఆర్థిక స్థితిని దిగజార్చుతున్నాయా? దేశంలో పేదలు ఇంకా ఉన్నారని ప్రపంచానికి చాటుతున్నారా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజ్యమేలుతున్న రాజకీయ పార్టీలు.. అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ.. ఇళ్లు కట్టిస్తున్నాయి. బతుకమ్మ పండుగకు బట్టలు పంపిణీ చేస్తున్నాయి. రూ.5లకు భోజనం, అక్కడక్కడ టిఫిన్లు కూడా అందిస్తున్నారు. ఇంతకుమించి పేదరిక వ్యవస్థను నిర్మూలించే ప్రణాళికలు మాత్రం రూపొందించడం లేదనేది స్పష్టమవుతోంది. ఉచితంగా బియ్యం, ఉచితంగా ప్రయాణం అంటూ ఉచితంగా అందించాల్సిన వైద్యం, విద్యావ్యవస్థలను మాత్రం ఖరీదైన సరుకులుగా మార్చుతున్నారనడానికి ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. అయితే, ఆ ఉచిత స్కీంలు అర్హులైన వారికే అందుతున్నాయా? అనేది ప్రశ్నార్థకమే. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేపట్టక ముందు కొందరు బియ్యం తీసుకునేవారు కాదని అందరికీ తెలిసిందే. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో చాలామంది తీసుకుంటున్నారని రేషన్ డీలర్లే చెబుతున్నారు. ఈ లెక్కన రేషన్ వినియోగదారుల్లో నిరుపేదలు తక్కువే ఉన్నారని స్పష్టమవుతోంది. రేషన్కార్డు అనేది పేదల స్టేటస్ గా మాత్రమే ఉపయోగపడుతుందోనడానికి ఇదొక నిదర్శనం. ఏదేమైనా.. ప్రభుత్వాలు పేదలను, పేదరికాన్ని పెంచి పోషించడం తప్పు. వారిని ఆర్థిక బలోపేతం చేసే ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి లేదని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.