
పూజ్యనీయులైన వ్యాక్యాలు అదృశ్యం
కుశలత లేని క్షేమ సమాచారం
మహారాజశ్రీ..
పూజ్యనీయులు..
శ్రీయుత గౌరవనీయులు..
ప్రియాతి ప్రియమైన.. అనే గౌరవనీయమైన మమకారపు పదాలు తెలుగు డిక్షనరీలోనే కనుమరుగయ్యాయేమో కదా! ఒకప్పుడు ఉత్తరాలలో ఈ పదాలు రాసేవారు. జడలు విప్పుకున్న సాంకేతిక విప్లవంలో సెల్‌ఫోన్లు ఈ పదాలను మింగేశాయి. అసలు ఉత్తరాలు రాయడమే ప్రజలు మరిచిపోయారు. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా పొడిపొడి పదాలకే పరిమితమైంది. గౌరవ ప్రదమైన పదాలతో మొదలయ్యే ఉత్తరాలలో రాసిన వారి హృదయాంతరాళంలో లేఖ అందుకునే వారి పట్ల గల ఆప్యాయత, గౌరవం నిండుకుని ఉండేది. పూజ్యులైన అమ్మ,నాన్నలకు, గురువులకు, అలాగే ప్రియమైన భార్యకు/భర్తకు, ప్రియాతిప్రియమైన నా కుమారుడు/కుమార్తెకు అనే పదాలు నేడు కరువయ్యాయి. సెల్‌ఫోన్ల ట్రెండ్ మొదలైన నాటినుంచి ఉత్తరాలు రాయడం రోజురోజుకు తగ్గి.. పూర్తిగా అంతరించిపోయింది. కేవలం కోర్టు నోటీసులు, చిట్‌ఫండ్ కంపెనీలు, బ్యాంకులు, బీమా సంస్థల నోటీసులకే పోస్టల్ సేవలు పరిమితమయ్యాయనే చెప్పాలి. ఇక ఉత్తరాల భాషలో మరో గౌరవ ప్రదమైన పదం.. శ్రీయుత గౌరవనీయులంటూ.. పోలీసులకు అందించే ఫిర్యాదులకు, ఆర్టీఐకి అందించే అర్జీలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు అందించే వినతిపత్రాల్లోనే కనిపిస్తున్నాయి. ఉత్తరాలు లేకపోయినా.. కనీసం సెల్‌ఫోన్లలోనైనా అమ్మనాన్నలకు లేఖలు రాసే అవకాశం ఉన్నా.. తెలుగు రాయడం, చదవడం నామూషిగా ఫీలయ్యేవారు.. వాటిని పూర్తి మరిచిపోయారు. అమ్మానాన్నలకు మెసేజ్‌లు పెట్టేవారు కూడా తక్కువే. ఒకవేళ మెసేజ్ పెట్టినా.. కుశల ప్రశ్నలు కూడా సంక్షిప్త పదాలకే పరిమితమయ్యాయి. ఎలా ఉన్నావు నాన్న.. అనే పదం ఒకటే.. అదే ఉత్తరాలలో అయితే నాన్నగారు నేను క్షేమం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను.. స్నేహితులకైతే ఉభయకుశలోపరి.. అంటూ సాగే ఆనాటి ఉత్తరాల భాష.. సెల్‌ఫోన్ల మాయాజాలంలో పూర్తిగా అంతరించిపోవడం హాస్యాస్పదం.
– జి.ఎన్.అయ్యగారు
