సెంటును మించిన వాసన!

  • ఇంపుగా బట్టల సోడ పరిమళం
    ఇప్పుడంటే పల్లెటూళ్లలో కూడా ఇంటింటికీ వాషింగ్ మెషీన్లు వచ్చాయి. ఒకవేళ చాకలికి బట్టలు వేసినా వాషింగ్ మెషిన్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, 30.. 40 ఏళ్ల క్రితం పల్లెల్లో ఎక్కువగా చాకలికి బట్టలు వేసేవారు. కొన్ని పట్టణాల్లో కూడా చాకలి వారికి ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా చెరువు వద్దకు వెళ్లి బట్టలు ఉతికి అక్కడే ఆరేసి.. సాయంత్రం ఇళ్లకు తీసుకొచ్చి ఇచ్చేవారు. వారు తీసుకొచ్చిన బట్టల నుంచి ఒకరకమైన వాసన వచ్చేది. కొంచెం ఇంపుగానే ఉండేది ఆ వాసన. ఇప్పుడయితే, సెంటు కొట్టుకుంటున్నారు కానీ.. అప్పట్లో ఆ వాసనకే బట్టలు ఏ సబ్బుతో పిండారని అడిగే వారు. కానీ, అప్పట్లో చాకలి వారు సోడా వేసి ఉతికేవారు. అంతే కాదు, వేడినీళ్లలో బట్టలు కాసేపు ఉంచి ఉతికేవారు. ఆ వేడినీళ్లలోనే సోడా వేయడం వల్ల బట్టలకు ఆ వాసన వచ్చేదేమో గానీ.. ఆ వాసన ఒక అనుభూతిగా అనిపించేది. ప్రతీ చెరువు వద్ద పొయ్యిలు, బట్టలు ఉడకబెట్టడానికి కుండలు కనిపించేవి. ఈ రోజుల్లో అలాంటి వాతావరణం బహుశా ఏ చెరువు వద్ద కూడా కనిపించదేమో! ఆ రోజుల్లో బట్టల సోడతోనే అదిరే వాసన వస్తే.. ఇప్పుడు బట్టలు మంచి వాసనగా ఉండాలంటే.. మార్కెట్లో రకరకాల రసాయనాలు లభ్యమవుతున్నాయి. కనీసం బట్టల సోడ ఉంటుందనే విషయం కూడా ఈ తరం వారికి తెలుసో లేదో? సోడ అంటే.. తాగేదనుకుంటారేమో!!
    – జి. నమస్తే.