బస్సు నీ అయ్యదా..?! బడి కాదా మరి..!
ఆర్టీసీ బస్సు.. సర్కారీ బస్సు.. ఎప్పుడైనా డ్రైవర్ బస్సు ఆపకపోతే.. బస్సు నీ అయ్యదా..? అంటూ ప్రజలు ప్రశ్నించిన సందర్భాలు చాలానే ఉంటాయి. కొన్ని ఊళ్లలో ఏకంగా బస్సును అడ్డుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి మహిళలు దూకుడు మామూలుగా లేదు. చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రజలు ఒక బస్సు విషయంలోనే తమ ఆస్తిగా ఫీలవుతున్నారే తప్ప.. స్కూళ్లు, కాలేజీల విషయంలో మాత్రం.. తమవి కావన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో ఇప్పటికే పలు పాఠశాలలు మూతపడ్డాయి. అయినా ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు. అసలు ప్రభుత్వ ఆస్తులంటేనే పరాయి ఆస్తులుగా చూస్తున్నారు. ఆ ఆస్తుల వెనుక ప్రజల చెల్లించే పన్నుల ఆదాయం ఉందనే విషయం మరిచిపోతున్నారు. స్కూళ్లకు కావల్సిన వసతులు, అందులో పని చేసే ప్రతీ ఒక్కరికి వేతనాలు చెల్లించేది ప్రజల సొమ్ముతోనే. ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి తమ ఆస్తులను కరిగించి.. ఏమీ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు.. ప్రభుత్వ పాఠశాలలను కాదని, అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివించడం.. సొంత కారు ఉన్నాక.. కిరాయి కారులో ఊరెళ్లినట్టే ఉంటుంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి, ప్రభుత్వ ఆస్తులను తమ ఆస్తులుగానే భావించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలనే అంశాన్ని గుర్తించాలి.