మూడు రోజులు భక్తిపారవశ్యంలో మునగనున్న బొడ్డుచింతలపల్లి
గ్రామంలో ప్రతిధ్వనించనున్న వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు
దేవతామూర్తుల ప్రతిష్ఠోత్సవాలతో సంతరించుకోనున్న ఆధ్యాత్మిక శోభ
ఆ గ్రామంలో శుక్రవారం నుంచి మూడు రోజులు మంగళవాయిద్యాలు ఆ గ్రామంలో ప్రతిధ్వనించనున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో దేవతామూర్తుల ప్రతిష్ఠోత్సవాలు ఆ గ్రామాన్ని భక్తి పరవశంలో ముంచెత్తనున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని బొడ్డుచింతలపల్లి భక్తిచింతలపల్లిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. కాకతీయుల కాలం నిత్యం పూజాధి కైంకర్యాలు జరిగిన ఇక్కడి దేవాలయం.. రాజ్యాలు, రాజులు మారే తరుణంలో జరిగిన యుద్ధాల ఫలితంగా ధ్వంసమైంది. ఇటీవల గ్రామస్తులంతా ఏకమై ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారు. గ్రామస్తులంతా రూ.50లక్షలు పోగు చేసి, మరో కోటి రూపాయలు దాతల ద్వారా సేకరించి ఈ బృహత్తర కార్యం చేపట్టారు. ఇక ఆలయంలో దేవుళ్లను నిలబెట్టే సమయం ఆసన్నమైంది. 2025, జూన్ 6 నుంచి మూడు రోజులపాటు ఆలయ ప్రతిష్ఠోత్సవాలకు ముహూర్తం పెట్టేశారు. శుక్రవారం నుంచి వైభవంగా వేడుకలను ప్రారంభించబోతున్నారు. పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, సీత సమేత రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి ఆలయం, భద్రకాళి సమేత వీరభద్రస్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు, చెన్నకేశవస్వామి విగ్రహాలను నెలకొల్పబోతున్నారు.
ఉత్సవాలు ఇలా..
మొదటి రోజు – శుక్రవారం, 6వ తేదీన వేదపారాయణం, గణపతి పూజ, జలాధివాసం, ధ్వజారోహణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రెండో రోజు – శనివారం, 7వ తేదీన వాస్తు హోమం, రుద్ర హోమం, శ్రీరామ హోమం, క్షీరాధివాసము, బలిహరణ, గ్రామ ప్రదక్షిణ, ధాన్యాధివాసం, వస్త్రాధివాసం కార్యక్రమాలు చేపడతారు. మూడో రోజు – ఆదివారం, 8వ తేదీన గవ్యాంత పూజలు, యంత్ర స్థాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ట, మహాపూర్ణాహుతి, మహాకుంభాషేకం నిర్వహిస్తారు.