
భారతీయులంతా వేర్వేరు!
నేను నా కులాన్ని ప్రేమిస్తున్నాను!!
భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను.. ఇది ఇప్పటివరకు పాఠశాలల్లో విద్యార్థుల చేత చేయించే ప్రమాణం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రమాణాన్ని ‘భారతీయులంతా వేర్వేరు.. నేను నా కులమును ప్రేమిస్తున్నాను..’ అని ప్రార్థన చేయాల్సి వస్తుందోమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులాల పేరిట హాస్టళ్లు, కులాల పేరిట రిజర్వేషన్లు, కులాల పేరిట ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి మొదలయ్యాయో గానీ, స్వచ్ఛమనసు కలిగిన వయస్సులో పిల్లల మదిలో కులాల అంతరాలకు రాజకీయాలు పునాదులు వేశాయి.. వేస్తున్నాయి. అసలు కులాలు వారు చేసే వృత్తుల ఆధారంగా నిర్ధారించారని పెద్దలు చెబుతుంటారు. మరి ఇప్పుడు.. కులాల ఆధారంగా వృత్తులు సాగుతున్నాయా? అంటే లేదు. మరి.. పనులు చేసుకుని బతకడానికి కులం అడ్డుకానప్పుడు.. పనులు కల్పించడానికి మాత్రం కులాలు ఎందుకు? కేవలం రాజకీయ నాయకుల స్వలాభానికి కాకపోతే.. కులం కూడు పెడుతుందా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. అందరి తలరాతలు రాసేవాడు బ్రహ్మ అని నమ్ముతున్న వారు.. ఆ బ్రహ్మది ఏకులమో కచ్చితంగా చెప్పగలరా? సృష్టికి లయకారుడిగా ఆరాధించే శివుడు ఏ కులస్తుడో తెలపగలరా? రఘుకుల తిలక అని కొలిచే శ్రీరాముడు.. ఓసీనా? బీసీనా?.. ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని తెలిసీ.. కులాల కుంపట్లు అవసరమా? భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా.. ఇంకా పేదరికం జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టి.. కులాల పునాదుల మీద అభివృద్ధి గోడలు కట్టడం.. సమాజంలో అంతరాలు సృష్టించడం మినహా.. భారతదేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు అన్న భావానికి అర్థం ఉంటుందా? ప్రజలే గమనించుకోవాలి. రాజకీయాల ఎత్తుగడలను అర్థం చేసుకోవాలి. రాజకీయాలకు, కులాలకు అతీతంగా సోదరభావంతో కలిసిమెలిసి ఉండేలా సుహృద్భావ వాతావరణం సృష్టించుకోవాలి.
– నమస్తే.
