ఎమ్మెల్యే ఏడుకొండలు!
మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి
దాసరి నారాయణరావు దర్శకత్వంలో సందేశాత్మక చిత్రం
1983లో విడుదలైన సినిమా.. నేటికీ ఆదర్శమే..

ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు మంగళి లింగయ్య అల్లుడు.. అంటూ ప్రజలు సంబోధించేవారు. దాన్ని ఆసరా చేసుకునే దాసరి నారాయణరావు.. ఎమ్మెల్యే ఏడుకొండలు.. సినిమా తీశాడేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో ఏడుకొండలు అనే క్యారెక్టర్‌ది మంగళి వృత్తిగా చిత్రీకరించారు. 1983లో దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా విడుదలైంది. రాజకీయ నాయకులకు సైతం.. కటింగ్‌, గడ్డం చేసే నారాయణరావు పోషించిన ఏడుకొండలుకు రాజకీయ పరిణామాల మధ్య ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కుతుంది. నాయకులే పోటీపడి ప్రచారం చేసి ఏడుకొండలును గెలిపిస్తారు. అయితే, ఏడుకొండలు నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని స్వయంగా ముఖ్యమంత్రి పాత్ర.. సమాజానికి వ్యతిరేకమైన నిర్ణయంపై ఏడుకొండలుతో వేలిముద్ర వేయించి.. అతనిని అవహేళన చేస్తారు. ఈ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్న ఏడుకొండలును అతని భార్య పాత్ర మేల్కొల్పుతుంది. ఆమె సలహాతో ఏడుకొండలు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాడు. తనకు మద్దతు పలికిన ఎమ్మెల్యేలందరినీ ఉప ముఖ్యమంత్రులుగా ప్రకటించి.. అన్ని శాఖలు ఏడుకొండలు తన వద్దే ఉంచుకుంటాడు. భార్య సలహాలు, పీఏ చాణక్యతతో ఏడుకొండలు.. అవినీతిపరుల నుంచి తెలివిగా డబ్బు రాబట్టి నిల్వ చేస్తాడు. చివరకు ఏడుకొండలు అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లోనే కాకుండా సొంత నాయకులు, ఇంట్లో నుంచి సైతం వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. భార్య కూడా ఏడుకొండలుకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతుంది. అంతా కలిసి.. ఏడుకొండలు పాల్గొన్న ఓ సభను ముట్టడిస్తారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చివరకు ఏడుకొండలు.. అసలు విషయం బయటపెడతాడు. ప్రజలు ఓటు అమ్ముకోవడం వల్ల.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారని, ఓట్లు కొనుగోలు చేసిన నాయకులు తిరిగి ఆ డబ్బు కూడబెట్టుకోవడానికి ప్రజలపైనే భారం మోపుతున్నారని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి, ఓట్లు అమ్ముకోకుండా నిజమైన నాయకులను ఎన్నుకోవాలంటూ ఉద్వేగంగా డైలాగులు చెబుతాడు ఏడుకొండలు. అవన్నీ వాస్తవాలే కావడంతో చిత్రంలో ప్రజలుగా నటించిన వారే కాదు, సినిమా ప్రేక్షకులు కూడా అబ్బ.. భలే తీశాడంటూ చప్పట్లు కొట్టే ఉంటారు..! ఏది జరిగిన, ఏం చేసినా అదంతా సినిమా అంటూ కొట్టి పారేయడం మాత్రం ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. అందుకే ఇప్పటికీ ఓట్లు అమ్ముకోవడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప.. ఓటు విలువ తెలుసుకోలేకపోతున్నారని నిస్సిగ్గుగా చెప్పొచ్చు. ఏదేమైనా.. 32 సంవత్సరాల క్రితం తీసిన సినిమా.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే తీసి ఉంటారు. మూడు దశాబ్దాలు దాటినా సమాజంలో ఇప్పటికీ అలాంటి రాజకీయాలే కొనసాగుతుండడం.. ప్రజల్లో నెలకొన్న అవివేకానికి నిదర్శనం!