• కొత్త సర్పంచ్ ఎన్నికలో సందిగ్ధత
  • అన్ని పార్టీలు ఒక్కటే ముచ్చట!
  • మంచోళ్లను ఎన్నుకోవాలని ప్రచారం
  • అందుకు కొలమానం ఉందా?
  • చెప్పేవారంతా మంచోళ్లు? చెద్దోళ్ల?
    తెలంగాణ అంతటా సర్పంచ్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల తరపున ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీల కీలక నేతలు సైతం అక్కడక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంచోళ్లను, మనోళ్లను ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ విషయం మంచిగనే ఉన్నా.. మంచోళ్లు, మనోళ్లను గుర్తించడమే కష్టతరమంటున్నారు ప్రజలు. పదవి వచ్చాక.. వ్యక్తులు మారరని గ్యారంటీ ఏమిటని సందేహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలే పదవుల్లో కుదురుకున్నాక ప్రజలను ఎలా పీడించుకు తింటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ అందుబాటులో ఉండకుండా.. కమీషన్లకు, అక్రమాలకు అండగా నిలుస్తున్నారనేది తెలియంది కాదు. అయితే, తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు గ్రామస్థాయిలో రాజకీయాలు చేసిన వారే. మరి నేటి సర్పంచ్లు.. రేపటి కొమ్ములుదిరిగిన నాయకులుగా ఎదగాలంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆదర్శంగా తీసుకోకుండా ఉంటారా? అనేది సందేహమే. ఇకపోతే.. మంచోళ్లు.. మనోళ్లు.. ఇంటిపక్కన గల వ్యక్తి మంచోడే.. ఇంతకాలం మంచిగనే మాట్లాడాడు. అవసరానికి ఆదుకున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలిచాడు. ఇతరులతో ఏవైనా గొడవలు వచ్చినుడు అడ్డుగా నిలబడ్డాడు. అంతవరకు అతడు మంచోడే. మరి.. అతడు సర్పంచ్ పోటీ చేస్తున్నాడని తెలిసి ఓటేశాక, అతడు గెలిచాక.. గతంలో ఉన్నట్టే ఉంటాడా? ఎన్నో లక్షలు పెట్టి ఓట్లు కొని గెలిచిన వ్యక్తి ఆ డబ్బును మళ్లీ పోగేసుకోవాలి. అందుకు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఎన్ని మిగులుతాయి? అతడు పెట్టిన ఖర్చుకు, అందుకు చేసిన అప్పుల వడ్డీ, అతని పోషణ, లీడర్ గా మెయింటనెన్స్.. సరిపోతాయా? ఇదంతా ఒకత్తయితే.. సర్పంచ్ అయ్యాక.. పెద్దమనిషి అయినట్టే. గ్రామంలో ఏ సమస్య వచ్చినా అతడి దగ్గరకే వెళ్తారు. కుటుంబంలో తగాదాలైనా, పొలాల కాడ గెట్ల పంచాయితీ అయినా.. సర్పంచ్ వద్దకే పరుగు తీస్తారు. ఈ సమయంలో మనోడు, మంచోడు అని ఊరంతా భావించిన సర్పంచ్.. ఎవరి పక్షాన నిలబడతాడు.. అందరికీ తెలిసిందే. ఎవరు డబ్బులు ఇస్తే.. వారి వైపే ఉంటాడని చిన్న పిల్లలను అడిగినా టపీమని చెప్పేస్తారు. ఈ బాగోతమంతా కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. సర్పంచ్ చెప్పిందే పోలీస్ స్టేషన్లలో వేదం. సర్పంచ్లు ఠాణాలకు వెళ్లగానే.. ఎమ్మెల్యేకు మించిన గౌరవం లభిస్తుంటుంది. అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్కే ప్రాధాన్యమిచ్చే పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఊరి సర్పంచు మర్యాద ఇవ్వకుండా ఉంటారా? అదీగాక, తండ్రి తంతెల మీద పోతే.. కొడుకు కోనేట్ల పోయినట్లుగా.. ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు వచ్చాక మారిపోతుంటే.. వారిని చూసి ఎదిగిన, ఎదుగుతున్న కొత్త నాయకులు.. మాత్రం మారకుండా ఉంటారా? ఈ క్రమంలో మంచోళ్లు, మనోళ్లు ఎవరు అనేది.. చెప్పిన వారే సెలవివ్వాలి?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *