
వరకట్నాలపై బంగారం ధరల ప్రభావం?
బంగారం రేటు రోజుకింత పెరుగుతూనే ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు వేల పైచిలుకు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.21లక్షల చిల్లర పలుకుతోంది. ఒకవేళ ధరలు దిగొచ్చిన రూ.500 లోపు ఉంటుంది. మళ్లీ తిరిగి రెండు, మూడు రోజుల్లో వెయ్యికి పైగా పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో అసలు బంగారం రేటు స్థిరంగా ఉండే అవకాశాలు లేవు. అయితే, పెరుగుతున్న ధరలు వరకట్నాలపై ప్రభావం చూపుతాయా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమ్మాయి తరఫు వారు ఇచ్చే కట్నంలో ముప్పావుల వంతు డబ్బులతో అబ్బాయి తరపు వారు అమ్మాయికి నగలు చేయించే ఆనవాయితీ ప్రస్తుతం కొనసాగుతోంది. తక్కువలో తక్కువ అంచనా వేసుకున్నా.. ఒక సామాన్యుడి పెళ్లిలో అమ్మాయికి రెండు గాజులు 4 తులాలు, పుస్తెలు అర తులం, కమ్మలు అర తులం, ఉంగరం పావు తులం.. కొంచెం అటు ఇటుగా ఆరు తులాలు పడుతుంది. ప్రస్తుత రేటు ప్రకారం ఆరు తులాలకు జీఎస్టీ కలుపుకుని రూ.7.20 లక్షలకు పైగానే ఖర్చవుతుంది. ఇది కేవలం బంగారానికి మాత్రమే. అంటే సాధారణ కుటుంబంలో అమ్మాయి పెళ్లి చేయాలంటే.. కట్నంగా పది లక్షలకు పైగానే చెల్లించి వరుడిని కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇతర పెట్టుబోతలు, ఆడపడుచుల లాంఛనాలు, విందు, కల్యాణ మండపం, బ్యాండు మేళా, అయ్యగారు, ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే.. రూ.15లక్షలు పైమాటే అవుతుందేమో? ఇక ఉన్నత వర్గాల్లో అబ్బాయిలకు ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటీవల గవర్నమెంట్ జాబులు కొట్టిన వారిలో పెళ్లికాని ప్రసాద్‌లకు మహా డిమాండే పలకునుందేమో! మొత్తంగా బంగారం పుణ్యమా? అని మొగుళ్లకు రేటు పెరుగుతుండడం.. అబ్బాయి తరపు వారికి.. స్టేటస్, ఇమేజ్ రెట్టింపయినట్టే?! అయితే, నిరుపేదల ఇంటి ఆడపడుచుల పెళ్లిళ్లకు బంగారం భారంగా మారే అవకాశం ఉంటుంది.
– నమస్తే.
