గడ్డి పెట్టే పరిస్థితిలో కూడా సర్కారు లేదని మండిపాటు
రాజన్న కోడెల మరణం రాష్ట్రానికే అరిష్టమని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కనీసం కోడెలకు గడ్డిపెట్టే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న హరీశ్‌రావు మీడియా సమావేశంలో కోడెల మృత్యువాతపై ఆవేదన వ్యక్తం చేశారు. కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి అప్పగించాలని సవాల్ చేశారు. ప్రజలు అంటే లెక్కలేదు. దేవుళ్ళంటే లెక్కలేదని విమర్శించారు. 500 రోజులు దాటినా ఇప్పటివరకు 6 గ్యారంటీల అమలుకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలన అంతా ఆగమాగం ఉందని అన్నారు. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే రేవంత్ రెడ్డికి అందాల పోటీ మీద మనసు లాగిందని విమర్శించారు. కనీసం ఆ రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి కానీ మంత్రులు గాని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు. రైతు బీమా ప్రీమియం రేవంత్ రెడ్డి కట్టకపోవడం వల్ల చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు భీమా రావడం లేదని ఆవేదన చెందారు. కొత్త రేషన్ కార్డులు ఇంకా ముద్రిస్తున్నావా? అని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏ రోజు కూడా రైతు బీమా ఆగలేదు. రైతుబంధు ఆగలేదు. రైతులకు ఇచ్చే విత్తనాలు ఆగలేదు. కాంగ్రెస్ నాయకుల సొంత ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులను, కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావుని అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. – నమస్తే