రాజకీయాలతో అరుదైన లక్కు
ఏ ఉద్యోగమైనా అరవై ఏండ్లు చేస్తే గానీ పించిని రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఉద్యోగం రాదు. ఎన్నో డబ్బులు పోస్తే గానీ చదువు దొరకదు. అదే డబ్బులకు మరిన్ని డబ్బులు పోగేసి.. కాసింత ఎక్కువ కష్టపడితే.. రాజులాంటి నౌకరీ. ఎమ్మెల్యేనో.. ఎంపీనో అయితే.. అయిదేండ్లే కొలువు! ఆ తర్వాత సచ్చేదాకా పించినీ.. ఇది మన రాజ్యాంగం.. మనం ఎన్నుకునే నాయకులకు అందిస్తున్న గౌరవ భత్తెం.. ఒక పించినే కాదు, సకల సౌకర్యాలు అందుతాయి. ప్రజల్లో అభిమానం, హోదాకు తక్కువేమీ ఉండదు. ఈ కొలువులకు చదువు కూడా అవసరం లేదు. రాత్రింబవళ్లు కష్టపడాల్సిందేమీ లేదు. పోటీ పరీక్షల్లా లక్షల మంది పోటీ ఉండదు. ఐదారుగురికి మించి పోటీ ఉంటే ఎక్కువే. డబ్బులే ఎగజల్లాలి. ఎన్ని ఎగజల్లితే అన్ని ఓట్లు. మెజారిటీ కొద్ది పెరిగే ప్రయారిటీ. మన నాయకులు మనం ఇస్తున్న మర్యాద. కానీ, మన పిల్లలు ఈ కొలువులు చేయాలనుకునే వారు తక్కువ. ఫారెన్‌ పోవాలె. పైసలు పంపాలె. సర్కారు నౌకరీ చేయాలె. 60 ఏండ్లు వచ్చేదాకా చాకిరి చేయాలె. అయినా ఫర్వాలేదు. బతుకు భరోసా అంటూ ప్రభుత్వ కొలువులు, ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటూ నేటి యువతను రాజకీయాలకు దూరం చేస్తున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చే నాయకుల మాటలకు తలూపి.. చప్పట్లు కొట్టడం తప్ప.. తమ పిల్లలను రాజకీయం వైపు నడిపిద్దామనే వారు మచ్చుకైనా దొరకరు. మంచి నాయకుడు వస్తే బాగుండు అనుకుంటారు గానీ.. తమ పిల్లలు మంచి నాయకులేనని నమ్మలేకపోతున్నారు. ఇదీ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అనుసరిస్తున్న మూసపోకడలకు నిదర్శనం. ఒక గొర్రె బావిలో పడితే మందకు మంద బావిలో పడినట్లుగా.. పక్కింటి వారి కొడుకు అమెరికా వెళ్లాడనో, నెలకు 5లక్షల జీతం వస్తున్నదనో.. సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు ఆకర్షితులవుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను నాయకులుగా చూసుకోవాలనే విషయాన్ని పసిగట్టలేకపోతున్నారు. 60 ఏండ్లు వచ్చేదాకా కష్టపడాలనుకుంటున్నారు గానీ.. ఐదేండ్లకే పించినీ.. సకల సౌకర్యాలు అందుతాయనే సంగతి విస్మరించి.. రాజకీయాలంటే ఓ బ్రోకరిజంలా చూస్తున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించి.. సమాజానికి మేలు చేసే.. యువతరాన్ని భావి భారతావనికి అందించాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. అప్పుడే.. నేటి బాలురే.. రేపటి పౌరులు అనే నినాదానికి అర్థం చేకూరుతుంది.
-జి.ఎన్‌.అయ్యగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *