
రైతులకు ఏవి రిజర్వేషన్లు!
దేశానికే వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదంటారు. రైతే రాజు అని కూడా అంటారు. మరి ఆ రాజుకు పాలించే అవకాశం ఎక్కడ? రైతులు పాలించలేరా? మహిళలకు రిజర్వేషన్లు, కులాల వారీగా రిజర్వేషన్లు? మరి రైతులకు అవసరం లేదా? వాళ్ల సమస్యలపై వారు గళం విప్పేందుకు అవకాశం ఇవ్వరా? రైతు బిడ్డలమని చెప్పుకునే నాయకులే తప్ప.. తాము రైతులమని చెప్పుకునే నేతలు ఒక్కరైనా ఉన్నారా? కనీసం.. నామినేటెడ్ పదవుల్లోనైనా రైతుల పక్షాన ఒక్కరికైనా అవకాశం ఇప్పటివరకు కల్పించారా? సామాజిక సేవ చేశారనో, లేదా వ్యాపార వేత్తలనో, క్రీడల్లో రాణించారనో చట్టసభలకు పలువురిని ఎంపిక చేస్తున్న పాలకులు, సమాజానికే ఆహారం అందించే రైతులను ఎంపిక చేస్తే.. రాజ్యాంగం అంగీకరించదా? లేదంటే.. రైతులంటే చులకన భావమా? జై జవాన్, జైకిసాన్ నినాదంను అనుసరించి.. జవాన్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో.. రైతులకు కూడా అలాంటి సౌకర్యాలు కల్పిస్తే.. చట్టాలు ఒప్పుకోవా? రైతు రాజ్యం, రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు పక్షపాతి అని చెప్పుకోవడం మినహా, రైతులకు ఎక్కడుంది రాజకీయ ప్రాధాన్యం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు.. రైతులకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించాలి. లేదంటే.. రైతులు కేవలం మట్టి మనుషులుగానే మిగిలిపోతారు.
-నమస్తే
