
వాళ్లు దొంగలు కాదా?
లంచం తీసుకోవడం నేరమే కదా?
మరి వీరి ఫొటోలు పోలీస్ స్టేషన్లలో ఎందుకు పెట్టరు?
తెలిసి చేస్తే దొంగతనమని చట్టంలో లేదేమో?
దొంగల వల్ల సమాజానికి భయమే. ఎక్కడ దొంగతనం జరిగినా.. మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు జనం. మరి.. లంచం తీసుకునే అధికారులంటే మాత్రం అందరికీ ఇష్టమే. అందులో అక్రమార్కులకు అమితమైన ప్రేమ. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినా.. అధికారులు ఏదో సాకుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నారు. ఈ బాగోతాన్ని అటు అధికారులు, పాలకులు, చివరకు ప్రజలు కూడా సర్వసాధారణంగా భావిస్తున్నారు. అందుకు కారణం.. ఏదో ఒకరోజు తమకు ఆ అధికారులతో పని పడుతుందేమోనన్న అవకాశవాదం. దీంతో అధికారులు కూడా లంచం తీసుకోవడం మానలేకపోతున్నారు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా లంచమే. ప్రభుత్వానికి చెల్లించే పన్నులు ఎగ్గొట్టాలన్నా లంచమే. పరాయి భూములు, సర్కారు స్థలాలు ఆక్రమించుకునేందుకు లంచమే సరిగా పని చేస్తుంది. అసలు లంచం అనే వ్యవస్థ లేకపోతే సమాజమే ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడిరది. అయితే.. దొంగతనం చేయడం నేరమని చెబుతున్న చట్టాలు.. లంచం తీసుకోవడం, ఇవ్వడమూ నేరమేనని స్పష్టం చేస్తున్నాయి. చట్టం ప్రకారం.. లంచాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక శాఖనే కేటాయించింది. లంచం తీసుకునే వారిని బాధితుల ఫిర్యాదు మేరకు వలపన్ని పట్టుకున్నారంటూ పత్రికలు, మీడియాలో తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తున్నారు… ప్రసారం చేస్తున్నారు. ఇకపోతే.. దొంగతనం చేసిన వారిని సమాజంలో ఎక్కడున్న గుర్తుపట్టేలా పోలీస్‌స్టేషన్లలో ఫొటోలు ప్రదర్శిస్తుంటారు. దొంగల వల్ల దోపిడీకి గురైన వారు మాత్రమే బాధపడుతుంటారు. కానీ, లంచం సమాజం పైనే ప్రభావం చూపుతోంది. అయినా.. లంచం తీసుకునే వారి ఫొటోలు మాత్రం.. బయటకు పొక్కవు. వారు దొరికినప్పుడు తప్ప.. వారి ఫొటోలు, వారి వార్తలు ఎక్కడా కనిపించవు. పైగా దొంగలకు శిక్ష పడినట్లు పోలీసులే స్వయంగా ప్రకటిస్తుంటారు. కానీ, ఇంతవరకు లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిలో ఏ ఒక్కరికీ శిక్ష పడినట్లు ఒక్క వార్త కూడా వెలువడకపోవడం.. విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు, పట్టుబడిన వారు ఎక్కడో చోట మళ్లీ ఉద్యోగాలు వెలగబెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, లంచం పుచ్చుకునే వారు ప్రజల వద్ద అడిగి తీసుకుంటారనే కారణంతో వారిని దోపిడీదారులు అనడానికి చట్టం అంగీకరించదా? అలాంటప్పుడు వారిని పట్టుకోవడమెందుకు? పట్టుకున్నామని పత్రికలు, మీడియాల్లో కథనాలెందుకు? తప్పు చేసిన వారికి శిక్ష పడకతప్పదనే నీతి సూక్తులెందుకు?
-నమస్తే.
