పట్టుకున్నా, పట్టుబడినా ఆగని దందాలు
సాధారణంగా చిన్నపిల్లలు వద్దన్న పనే ఎక్కువగా చేస్తుంటారని చెబుతుంటారు. కానీ, పెద్దలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా కొన్ని వ్యాపారాలు, కొందరు వ్యాపారులు దొంగ సరుకుల విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటారు. ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తులను గుట్టుగా వ్యాపారం సాగిస్తూనే ఉన్నారు. పోలీసులు పట్టుకున్నా, వారికై వారు పట్టుబడినా దందా మాత్రం ఆపడం లేదని నమోదవుతున్న కేసులే తేటతెల్లం చేస్తున్నాయి. వివిధ పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయినా గుట్టుగా వ్యాపారం సాగుతూనే ఉంది. ఇందుకు గుట్కాలు, అంబర్ల దందానే నిదర్శనం. అసలు ఈ సరుకు నిషేధం లేనప్పుడు రూ.5, రూ.10 లకు మించి లేదు. నిషేధం విధించిన తర్వాత రూ.15, రూ.20కి పెరిగింది. ఇదొక్కటే కాదు, గంజాయి, డ్రగ్స్ విక్రయాలు నేరమని తెలిసినా కొనసాగుతూనే ఉన్నాయి. రేషన్ బియ్యం వ్యాపారానికి కూడా అడ్డు లేకుండా పోయింది. నల్లబెల్లం అమ్మకాలు, నాటుసారా విక్రయాలకు కొదువ లేదు. అలాగే లంచం తీసుకోవడం నేరమని తెలిసినా, నిత్యం ఏదో చోట అధికారులు పట్టుబడుతున్నా.. లంచగొండితనం మాత్రం ఆగడం లేదు. ఒకరకంగా నిషేధం అనే పదం సరుకుల ధరలను పెంచుతున్నదే తప్ప.. నియంత్రించలేకపోవడం గమనార్హం. అందుకు గల కారణాలేమైనా నిషేధిత వస్తువుల వ్యాపారం మాత్రం లాభసాటిగానే కొనసాగుతున్నది. – నమస్తే.