
వేమన పుట్టాల్సిందే!
బంగారం ధరలతో కంగారెత్తుతున్న సామాన్యులు
బంగారం.. అతివలకు అమితమైన ఇష్టం. ఏం కావాలో కోరుకోమంటే.. కలలో కూడా బంగారమే కావాలనేంత ఇష్టం. అయితే, ధరలు చూస్తే సామాన్య ప్రజానీకంలో నిట్టూర్పు వెల్లువెత్తుతోంది. కనీసం ఈసమెత్తు ముక్కుపుడక చేయించుకునేందుకు కూడా సాహసించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. తులం బంగారం లక్ష 23వేలకు చేరిన ధరతో కంగారెత్తిపోతున్నారు. కొనాలనే ఆశ అటుంచి.. పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లలో తాలిబొట్టు కరువుతుందా? అనే సందిగ్ధంలో మునిగిపోయారు. పూర్వకాలంలో పసుపుకొమ్ము కట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయా? అని దిగులు చెందుతున్నారు. గడిచిన 30ఏళ్లతో పోల్చితే ధరలు పదింతలు పెరగడం.. బంగారం సామాన్యులకు భారంగానే మారింది. రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు పరిశీలిస్తే.. యోగి వేమనను గుర్తుకు తెస్తున్నాయంటున్నారు. ఎవరికి వారు యోగి వేమనలా మారి.. బంగారం తయారు చేసుకోవాలా? అంటూ ఒకింత ఆశ్చర్యానికి, ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. వంద రూపాయలు పలికిన తులం వెండి ఇప్పుడు వంద రెట్లు పెరిగి పదివేలకు పైనే పలుకుతుండడం కూడా సామాన్య ప్రజానీకాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. వేమనలాంటి వారు పుట్టుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదంటున్నారు. మరి అలాంటి రోజులు వస్తాయా? బంగారం ధరలు దిగివస్తాయా? అనేది సంశయమే!
– నమస్తే.
