సర్కారు పథకాలు మనవే సర్కారు స్కూళ్లూ మనవే
ప్రభుత్వం అమలు చేసే ఏ పథకమైనా అర్హులందరికీ దక్కాలని అనుకుంటాం. అందుకు అవసరమైతే అధికారులను ప్రశ్నిస్తాం. నాయకులను నిలదీస్తాం. అర్హత ఉన్నా మాకెందుకు రావంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటాం. పథకాలకు పెట్టే డబ్బులు మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అంటూ గొడవకు దిగుతాం. ప్రజల సొమ్ము ప్రజలకే పెడుతున్నారంటూ నానా యాగీ చేస్తాం. అదే సర్కారు స్కూళ్ల విషయానికి వచ్చేసరికి పిల్లలను చేర్పించడానికి వెనుకంజ వేస్తాం. అందుకు సవాలక్ష కారణాలు చెబుతుంటాం. టీచర్లు పట్టించుకోరని, చదువు మంచిగ చెప్పరని, బెంచీలు లేవని.. ఇలా ఏవో సాకులు వెతుకుతుంటాం. ఆ లోపాలపై ఎవరినీ అడిగే సాహసం చేయం. అధికారులను ప్రశ్నించం. నాయకులను నిలదీయం. పథకాలకు పెట్టే డబ్బులు మనవైతే, సర్కారు స్కూళ్ల నిర్వహణకు, టీచర్ల వేతనాలకు ఇచ్చే డబ్బులు కూడా మనవేనని ఆలోచించం. అప్పులు చేసైనా ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై నిందలు వేస్తుంటాం. ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నా.. వేలకు వేలు పెట్టి ప్రైవేటు స్కూళ్లలోనే బుక్స్ కొంటాం. వాళ్లు అడిగిన ఫీజులు చెల్లిస్తాం. చివరకు ఆటలపోటీలకు కూడా డబ్బులు మనమే చెల్లిస్తాం. రేషన్‌కార్డు స్టేటస్‌గా భావించే మనం.. ప్రభుత్వ విద్యను మాత్రం విస్మరిస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలు మన ఆస్తి అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. వాటిని పరిరక్షించుకునేందుకు క్షణమైనా ఆలోచించలేకపోతున్నాం. మనలో ఒక వర్గం ప్రజలు, తమ పిల్లలకు ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్లో రాయితీలు కల్పించేందుకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వర్గం ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వ విద్యారంగం తీరే మారిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. గళం విప్పలేకపోతున్నారు.. కలం కదపలేకపోతున్నారు. -నమస్తే