తీర్పు వెలువరించిన జడ్జి టి.మాధవీదేవి
స్థానిక ఎన్నికల తేదీ ఖరారు కాకపోయినా ఎప్పటివరకు నిర్వహించాలనే విషయం తేలిపోయింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జడ్జి టి.మాధవీదేవి తీర్పునిచ్చారు. తెలంగాణలో జిల్లా పరిషత్, మండల పరిషత్,గ్రామ పంచాయతీ ల ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. గతంలోనే విచారణ జరిగింది. జనవరి 30, 2025న జరిగిన విచారణలో, హైకోర్టు బెంచ్ పంచాయతీ రాజ్ శాఖను మూడు వారాలలో సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. కొంత జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ విచారణకు వచ్చింది. గత విచారణలో ప్రభుత్వం ఫిబ్రవరిలోపు ఎన్నికుల నిర్వహిస్తామని చెప్పింది. కానీ ఫిబ్రవరి ముగిసిపోయి మరో నాలుగు నెలలు గడిచిపోయినా ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు మరో అరవై రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. – నమస్తే.