రద్దీ పెరగడంతో దర్శనం ఆలస్యం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం.. మహద్భాగ్యం. ఏడుకొండలవాడి దర్శనం కోసం ఎన్ని గంటలైనా వేచి ఉండడం భక్తుల్లో ఓపికకు నిదర్శనం. ప్రభుత్వ ఆఫీసులు, ఇంకా ఎక్కడైనా క్షణం పాటు క్యూలైన్‌లో నిలబడాలంటే అసహనానికి గురయ్యే ప్రజలు.. తిరుమలలో మాత్రం శ్రీవారి దర్శనానికి కొన్ని రోజులుగా 16 గంటల సేపు పడుతోందని టీటీడీ ప్రకటించింది. అంత సేపు భక్తులు వేచి ఉండడం వారి సహనానికి పరీక్షే. వేములవాడ, కొమురవెల్లి, యాదాద్రి ఆలయాల్లో క్యూలైన్ కాసేపు కదలకుండా ఉందంటే.. ఏమైందంటూ కేకలు వేస్తుంటారు. కానీ, తిరుమలలో సకల సౌకర్యాలు ఉన్నా అన్ని గంటలు నిరీక్షించడం భక్తుల్లో ఓర్పుకు, భక్తికి నిదర్శనంగా చెప్పొచ్చు. పైగా సెల్‌ఫోన్లు కూడా వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. అయినా, భక్తులు ఉండగలుగుతున్నారంటే నిజంగా ఆ శ్రీనివాసుడి మహిమే అనుకోవాలి. అయితే, మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండడం వల్ల భక్తుల రద్దీ పెరగడం వల్ల దర్శనంలో ఆలస్యం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా వేయినామాల వాడి దర్శనం.. వేలాది భక్తుల్లో దాగున్న సహనాన్ని వెలికితీయడం మహిమాన్వితమే. ఇదే ఓపిక సాధారణ జీవితంలో పాటిస్తే.. పక్కదారులు తొక్కే అవకాశం ఉండదు కదా! లంచాలు పెట్టి పనులు చేయించుకునే పరిస్థితులు గోవిందా..! హరి గోవిందా! – నమస్తే