చందమామకు పయనం కడుతున్న మానవులు
ఇప్పుడంటే సెల్‌ఫోన్లలో లేదా టీవీల్లో ఏవో బొమ్మలు చూపించి చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తున్నారు గానీ, ఒకప్పుడు ఆకాశంలో చందమామను (అద్దంలో) చూపించి తినిపించేవారు. ఆరుబయట నిద్రించే సమయంలో చందమామలో మర్రిచెట్టు ఉందని, దానికింద పేదరాసి పెద్దమ్మ కూర్చుందని కథలు కథలుగా చెప్పేవారు. చిన్నప్పుడు అమ్మ ఎంత పిలిచినా రాని చందమామను ఎందుకు చేరుకోలేమా? అనే ఆలోచనతో ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి.. చివరకు రాకెట్ల ద్వారా వెన్నెలమ్మను చేరుకున్నారు. అక్కడ ఉండేందుకు గల పరిస్థితులను అన్వేషిస్తున్నారు. చందమామను చేరుకున్న మొదటి వ్యక్తి నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్. కాగా, చిన్నప్పుడు చెప్పుకున్న కథలు కథలుగానే మిగిలాయి. అక్కడ మర్రిచెట్టు, పేదరాసి పెద్దమ్మ పుక్కిటి పురాణాలుగానే తేలిపోయింది. మొత్తానికి చిన్నప్పుడు అమ్మ పిలిచిన చందమామ చెంతకు ప్రయాణం కట్టడం మానవుల మేధోసంపత్తికి, శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధికి నిదర్శనం. అయితే, చందమామ కథలు పుట్టిన భారతదేశం నుంచి మాత్రం ఇప్పటివరకు జాబిల్లిపై ఒక్కరు కూడా అడుగుపెట్టక పోవడం కొంచెం వెలతిగానే చెప్పుకోవాలి. – నమస్తే.