దెబ్బతింటున్న శరరీభాగాలు
1990 దశకంలో కళ్ల దవాఖానాలు నగరంలో ఒకటీ రెండు ఉండేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో పెరిగిపోయాయి. అందుకు పోటీగా ఇప్పుడు పండ్ల దవాఖానాలు కూడా వెలుస్తున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే దృష్టి లోపాలు ఉండేవి. వాళ్లే కళ్లద్దాలు పెట్టుకునేవారు. కానీ, 2కే దశకంలో చిన్నపిల్లల్లో కూడా కంటిచూపు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కొందరిలో జన్యుపరమైన లోపాలు అనుకుంటే మరికొందరిలో ఆహార అలవాట్లు ప్రధాన కారణంగా చెబుతుంటారు. దీంతో కొంతమందికి చిన్నతనంలోనే దృష్టిలోపాలు తలెత్తి అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్లపైనే ఎక్కువగా పని చేయాల్సి ఉంటోంది. అయితే, కంప్యూటర్ స్క్రీన్ వల్ల కంటికి ఇబ్బంది కలిగే ప్రమాదం పొంచి ఉండడంతో కంటి అద్దాలు తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది. ఇక బైక్ డ్రైవింగ్ చేసే సమయంలోనూ కంటి అద్దాలు వాడడం అలవాటుగా మారింది. ఇలా కంటి దవాఖానాలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా అధునాతన పరికరాలతో ఆస్పత్రులు వెలుస్తూనే ఉన్నాయి.
పండ్ల సమస్యలు అనేకం!
కండ్ల సమస్యలే కాదు, చాలామందిలో పండ్ల(దంతాలు) సమస్యలు ఎక్కువయ్యాయి. ఇందుకు తిండి ఒక కారణం కాగా, పండ్ల వరుస ఇబ్బందిగా మారడం మరో కారణం. చాలామంది పురుషులు, కొందరు మహిళలకు పాన్లు, గుట్కాలు, అంబర్ తినే అలవాటు ఉంది. పురుషులైతే పొగాకు ఉత్పత్తులు అధికంగా తీసుకుంటున్నారు. దీంతో పండ్ల రంగు మారి అధ్వానంగా కనిపిస్తుంటాయి. ప్రతిఒక్కరి ముఖారవిందంలో పండ్లు కీలకం. పొగాకు ఉత్పత్తుల వల్ల పండ్లు అందవిహీనతకు దారి తీస్తున్నాయి. దీంతో చాలామంది పండ్లు శుభ్రం చేసుకోవడానికి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పెళ్లి కాని యువతుల్లో పండ్ల వరుస సమస్యగా మారుతోంది. ఫలితంగా పండ్ల వరుసను చక్కదిద్దుకోవడానికి ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఇంకొందరిలో చల్లని పానీయాలు, ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల పండ్లు దెబ్బతింటున్నాయి. ఇలా ప్రస్తుత సమాజంలో కండ్లు, పండ్ల దవాఖానాలకు ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతోంది. డాక్టర్లకు ఆదాయం సమకూర్చుతోంది. – నమస్తే