• సీఎం రేవంత్‌రెడ్డి.. ఓ మంచిపని!
    ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్ప నిర్ణయమే తీసుకున్నారు. హోంశాఖను తన వద్దే అట్టిపెట్టుకుని మంచి పనే చేశారు. ఇప్పటికే పోలీస్‌ శాఖపై పొలిటికల్‌ ప్రభావం తీవ్రంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. కొందరు పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అపవాదు ప్రజల్లో బలంగా ఉంది. ఈ క్రమంలో పోలీస్‌ శాఖను తన దగ్గరే ఉంచుకోవడంతో పైరవీకారుల నోళ్లకు తాళాలు వేసినట్లయింది. గతంలో హోంశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించడంతో ఇతర మంత్రులు, లీడర్లు.. తమకు అనుకూలంగా లేని పోలీసులను బదిలీ చేయించడమో, తమకు అణుకవగా మార్చుకోవడమో.. సదరు హోంమంత్రిని కాకా పట్టి పనులు చేయించుకునే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రినే ఆ శాఖను పర్యవేక్షిస్తుండడంతో ఆయనకు ఫోన్‌ చేసేంత సాహసం అందరు నాయకులు చేయకపోవచ్చు. అదే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వర్సెస్‌ పొలిటికల్‌ లీడర్స్‌ అనే స్థాయిలో పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు పోలీసులు తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొందరు పోలీసులు కొన్ని చోట్ల స్థానిక నాయకుల కొమ్ము కాస్తున్న సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్‌ శాఖపై ఉంది. కేవలం సస్పెండ్‌ చేయడమో లేదా లూప్‌లైన్‌లో పెట్టడమో కాకుండా, వారు ఎక్కడ పని చేస్తున్నారో అదే పీఎస్‌లో కానిస్టేబుల్‌గానో లేదా సెంట్రీ డ్యూటీలోనే నియమిస్తే.. ఇతర పోలీసులకు గుణపాఠంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *