• బనకచర్లను ఆపేదెవరు?
    బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయ పార్టీల నడుమ చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ నిర్వాకం వల్లే ప్రాజెక్టు కొనసాగుతున్నదని తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గోడల మీద పిడకలు కొట్టినంత పని చేస్తోంది. మరో పక్క అధికారంలో ఉన్న పార్టీకి ఆ ప్రాజెక్టును అడ్డుకునే శక్తి లేదా? అని బీఆర్‌ఎస్‌ సవాల్‌ విసురుతోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడా సమస్య పెండలో రాయి వేసినట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పడిరది. మరి బీజేపీ ఆ ప్రాజెక్టును అడ్డుకుంటుందా? అంటే.. ఆ ప్రాజెక్టు ఉన్న ఏపీలోని అధికార టీడీపీతో కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక బలమైన స్నేహబంధం కొనసాగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణకు న్యాయం చేయాలనుకుంటే టీడీపీతో దోస్తీ దెబ్బతినే ఆస్కారం ఉన్నా.. లేకున్నా.. బీజేపీ అంత సాహసం చేస్తుందా? దక్షిణాదిలో పాగా వేయాలని బీజేపీ దాదాపు 15ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై గురిపెట్టిన బీజేపీ.. ఏపీలో పొత్తు రాజకీయాలతో అధికారంలో ఉన్నంతగా భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీ కేంద్రంగానే దక్షిణాదిలో చక్రం తిప్పాలనే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ తరుణంలో ఏపీతో దోస్తీ కారణంగా బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందంటూ ఇక్కడ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇప్పటికే తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం పక్షపాత వైఖరి అవలంబిస్తున్నదని కాంగ్రెస్‌ గగ్గోలు పెడుతోంది. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. కాంగ్రెస్‌కు రాజకీయంగా కలిసొచ్చే అవకాశంగా మారుతుంది. మరోపక్క తెలంగాణలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈ తరుణంలో బనకచర్ల ప్రాజెక్టు అంశం బీజేపీకి పెద్ద పరీక్షే. విడిచిపెట్టు అంటే పాము కోపం.. తినమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే కృష్ణా జలాల పంపిణీ విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇక బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని బీజేపీ పరిష్కరిస్తుందా? పెండిరగ్‌లో పెడుతుందా? తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు ఎలా స్పందిస్తారు? అనేది వేచిచూడాల్సిందే.
    – నమస్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *