నేడు సంపాదనే ధ్యేయం..
పరాయి దేశస్తులు.. ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు.. మన దేశ నాయకులు బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడారు. ఈ క్రమంలో పలువురు నాయకులను జైళ్లలో బంధించారు. భరతమాత సంకెళ్లను తెంచేందుకు ఆనాడు మన నాయకులు జైలుకెళ్లడానికైనా సిద్ధంగా ఉండేవారని పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. అయితే, నేడు కూడా మన నాయకులు జైళ్లకు వెళ్తున్నారు. కానీ, స్వాతంత్య్రం కోసం కాదు. అక్రమ సంపాదనకు అర్రులు చాచి కటకటాల పాలవుతున్నారు. స్వతంత్ర సంగ్రామంలో వీరుల్లాగా చెరసాలకు వెళ్లిన నేతలున్న ఈ భరతావనిలో ఈనాడు అవినీతి, అక్రమాలకు అలవాటుపడి చోరులుగా ముద్రపడి కారాగారం చేరుతున్నారు. నాడు ఆంగ్లేయులకు ఎదురొడ్డి.. దమ్ముంటే కాల్చుకోమంటూ గుండెలు చూపించిన నాయకులుంటే.. నేడు దమ్ముంటే ఎన్ని కేసులైనా పెట్టుకోమంటూ సవాల్ చేసే నాయకులుండడం 77ఏళ్ల స్వతంత్ర భారతంలో చోటుచేసుకున్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. – నమస్తే.